
కాలువలోకి పెళ్లి బస్సు పల్టీ
ప్రమాదానికి గురైన బస్సు
కాలువలో పడిన బస్సును వెలికి తీస్తున్న దృశ్యం
కోలారు: వివాహ రిసెప్షన్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా బస్సు నీటి కాలువలోకి బోల్తా పడి 30 మందికి పైగా గాయపడిన ఘటన కోలారు – చింతామణి రోడ్డులోని సుగటూరు వద్ద మంగళవారం రాత్రి 10 గంటలకు జరిగింది. వివరాలు.. చిక్కబళ్లాపురం జిల్లా శిడ్లఘట్ట తాలూకా దిబ్బూర హళ్లి కి చెందిన వధువు పెళ్లి బృందం వారు 3 బస్సులలో కోలారు నగర సమీపంలోని రత్న కన్వెన్షన్ హాల్‌లో రిసెప్షన్‌కు వచ్చారు. రాత్రి భోజనాలు చేసుకుని తిరుగుముఖం పట్టారు. సుగటూరు గ్రామం వద్దకు చేరుకోగానే ఓ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కేసీ వ్యాలీ ఉప కాలువలోకి జారింది. బాధితులు హాహాకారాలు చేశారు. ఈ ప్రమాదంలో 15 మంది మహిళలతో పాటు 30 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో 5 మంది కి తీవ్ర గాయాలు కాగా వారిని కోలారులోని ఆర్ ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మిగిలిన వారికి చిన్న చిన్న గాయాలు తగిలాయి. కోలారు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం క్రేన్ సహాయంతో బస్సును కాలువ నుంచి బయటకు లాగారు.
30 మందికి గాయాలు
కోలారు వద్ద దుర్ఘటన

కాలువలోకి పెళ్లి బస్సు పల్టీ