
హెచ్చెల్సీలో దూకి వ్యక్తి ఆత్మహత్య
బొమ్మనహాళ్: బళ్లారి సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని హొసపేటె పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఆర్ధిక ఇబ్బందులతో హెచ్చెల్సీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలువలోకి దూకిన ఆ వ్యక్తి బొమ్మనహాళ్ మండలం దేవగిరి క్రాస్ సమీపంలోని హెచ్చెల్సీ డిస్ట్రిబ్యూటరీలో శవమై కనిపించాడు. బొమ్మనహాళ్, హొసపేటె పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు కర్ణాటకలోని హొసపేటె టౌన్‌కు చెందిన జమీర్ ఉల్లా షరీఫ్(43)గా గుర్తించారు. ఇతను ఆర్ధిక ఇబ్బందులతో మానసిక వేదనకు గురై తాను కాలువలోకి దూకి చనిపోతున్నాను, హొసపేటె పోలీసులకు సమాచారం ఇవ్వండి అని మంగళవారం బళ్లారి సమీపంలోని అల్లీపుర వద్ద సెల్ఫీ వీడియో తీసి కాలువలోకి దూకే ముందు ఆ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు. బుధవారం అతని శవం డిస్ట్రిబ్యూటరీ కాలువలో కనిపించడంతో స్ధానికులు బొమ్మనహాళ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు పరిశీలించి హొసపేటె పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం బళ్లారి విమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హొసపేటె పోలీసులు తెలిపారు.

హెచ్చెల్సీలో దూకి వ్యక్తి ఆత్మహత్య