
సంచార వాహిని
హుబ్లీ: శ్రమించే కార్మికులు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హైటెక్ ట్రాఫిక్ హెల్త్ యూనిట్ అంటే మొబైల్ మెడికల్ యూనిట్ పథకాన్ని ఇప్పటికే అమలు చేసింది. సదరు కార్మికులు పని చేసే చోట్లకు వాహనం అక్కడికే వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన ఔషధాలు అందించి వారి ఆరోగ్యం బాగు కోసం సదరు వాహనాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. కాగా వీటిని దావణగెరె జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తూ మూడు మొబైల్ మెడికల్ యూనిట్లను తాజాగా ఏర్పాటు చేశారు. కార్మికులు ఆరోగ్య సమస్య తలెత్తగానే వారు ఉన్న చోటుకే వైద్యులతో కూడా ఈ యూనిట్ వెళ్లి ఉచిత చికిత్స, ఉచిత ఔషధాలు ఇస్తున్న కార్మికుల కార్డులు పొందిన ప్రతి కార్మికుడికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ సంచార ఆస్పత్రిని తగిన వసతులతో చక్కగా ఆరోగ్య పరీక్షలు చేయడానికి అనువుగా తీర్చిదిద్దారు.
మున్ముందు అన్ని తాలూకాలకు సేవల విస్తరణ
ఈ మేరకు ఇలాంటి మూడు అత్యాధునిక మొబైల్ ఆరోగ్య యూనిట్లను దావణగెరె తాలూకా హరిహర, చెన్నగిరి తాలూకాలకు కేటాయించామని మున్ముందు అన్ని తాలూకాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపని సంబంధిత కార్మికుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 100 మొబైల్ ఆస్పత్రుల వాహనాలకు శ్రీకారం చుట్టి పేద కార్మికులకు ఆరోగ్య భాగ్యాన్ని కల్పించింది. ఈ సౌకర్యాన్ని ప్రతి కార్మికుడు పొందేలా వారికి అవగాహన కల్పిస్తామని కార్మిక శాఖ అధికారులు తెలిపారు. గత ఏప్రిల్ 21వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటి వరకు దావణగెరె జిల్లాలో 5 వేల మంది కార్మికులు లబ్ధి పొందారు. ప్రతి నెల 1200 మంది కార్మికులకు చికిత్స అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంచార ఆస్పత్రి వల్ల ఆస్పత్రుల కొరత తీరడానికి ఉపయోగపడుతుంది. మొత్తానికి పని చేసే చోట వివిధ కారణాలతో సహజంగా లేక ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడిన కార్మికుల పాలిట ఈ మొబైల్ ఆస్పత్రి అవసరం ఎంతో ఉందని కార్మికులు అభిప్రాయ పడ్డారు.

సంచార వాహిని