
బైపాస్‌లో అండర్ పాస్ కోసం ఆందోళన
బళ్లారిటౌన్: నగరంలోని సంగనకల్లు వద్ద గల దొడ్డబసవేశ్వర లేఅవుట్ వెనుక భాగంలో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డులో స్థానికంగా ఉన్న 40 అడుగుల వెడల్పు రోడ్డులో అండర్ పాస్ నిర్మించాలని స్థానిక శివసాయి టౌన్ షిప్ నివాసులు బుధవారం ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం స్థానికంగా పనులు జరుగుతున్నందున వాహనాన్ని అడ్డుకొని మహిళలు, పురుషులు నిరసన వ్యక్తం చేశారు. బైపాస్‌కు అండర్ పాస్ ఇవ్వక పోతే తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని, దాదాపు ఈ ప్రాంతంలో వందలాది ఇళ్ల నిర్మాణాలు జరిగాయని, పిల్లలు, ఉద్యోగులు బయటకు వెళ్లాలంటే ఇటు సంగనకల్లు రోడ్డు కాని, అటు కప్పగల్ రోడ్డు కాని చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఇక విద్యార్థులకు స్కూలు బస్సులు తమ కాలనీ వరకు వచ్చేవని, ఈ రోడ్డు నిర్మాణం వల్ల అటు వైపునే స్కూల్ బస్సులు నిలిపితే తమ పిల్లలు వెళ్లేది ఎలా? అని ప్రశ్నించారు. దీనిపై తాము ఇప్పటికే ఎంహెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు, వివిధ స్థాయిల అధికారులకు కూడా వినతిపత్రాలను సమర్పించామని తెలిపారు. కానీ ఇంత వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు స్థానికులు మల్లప్ప, మోహన్‌రెడ్డి, బసవరాజు, లక్ష్మిరెడ్డి తదితరులు తెలిపారు.