
ఎలక్షన్ కోడ్‌ను పక్కాగా అమలు చేయాలి
● వీసీలో రాష్ట్ర ఎన్నికల అధికారిణి
రాణి కుముదిని
● నామినేషన్‌ల స్వీకరణ ఏర్పాట్లపై సూచనలు
కామారెడ్డి క్రైం: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని(కోడ్) పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారిణి రాణి కుముదిని సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా మాట్లాడారు. అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలన్నారు. సున్నిత ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడతలో భాగంగా 14 జెడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను వివరించారు. ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, డీఆర్‌వో మధుమోహన్, డీపీవో మురళి, శిక్షణ కలెక్టర్ రవితేజ, అధికారులు పాల్గొన్నారు.