
అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యం
అలంపూర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. అలంపూర్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కై వలం చేసుకుంటుందన్నారు. బీజేపీ నుంచి పోటీదారులు అధికంగా ఉన్నారని, ఒక్కో స్థానానికి కనీసం ఐదుగురు పోటీదారులు ఉండటం సంతోషమన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని, వారి పథకాలను చూసి ప్రస్తుతం ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ కుటుంబ అవినీతి తప్ప ప్రజలకు మేలు చేయలేదన్నారు. అందుకే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థులకే ఓటు వేస్తారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు కావాల్సిన వస్తు సేవలు దసరా కానుకగా పూర్తిగా తగ్గించిందన్నారు. గ్రామాల్లో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి వచ్చినవే అన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగమల్లయ్య, నాగేశ్వర్ రెడ్డి, రాజగోపాల్, వినీత్ కుమార్, రంగస్వామి, సుధాకర్, రవికుమార్, లక్ష్మన్ నాయుడు, సాయిబాబ, దానారెడ్డి, రాఘవేంద్ర, జగన్‌మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.