
మరో కొత్త రహదారి
అచ్చంపేట: హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765 త్వరలోనే నాలుగు వరుసలుగా మారనుంది. రావిర్యాల– ఆమనగల్– మన్ననూర్ గ్రీన్‌ఫీల్డ్ రహదారితోపాటు శ్రీశైలం జాతీయ రహదారిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన్ననూర్– శ్రీశైలం మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత నెల 9న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గేట్ నుంచి ఆమనగల్, కొట్ర, డిండి, హాజీపూర్ (బ్రాహ్మణపల్లి) వరకు నాలుగు వరుసల రహదారి ఏర్పాటుకు సర్వే నిర్వహించి.. హద్దులు కూడా నిర్ణయించారు. ఈ రహదారి విస్తరణకు మూడేళ్ల క్రితమే కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ నిధులు మాత్రం మంజూరు కాలేదు. ఇప్పుడు కొత్త గ్రీన్ ఫీల్డ్ రహదారితో ఇబ్బందులు తొలగనున్నాయి.
ఆకుతోటపల్లి– మన్ననూర్..
శ్రీశైలం, నాగార్జునసాగర్ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఫ్యూచర్ (ఫోర్త్) సిటీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రెండు జాతీయ రహదారుల మధ్య నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఎంతో కీలకం కానుంది. రావిర్యాల ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు.. అక్కడి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు ఆమనగల్ (ఆకుతోటపల్లి) వరకు ప్రతిపాదించిన 330 అడుగుల రతన్‌టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మొదటి దశలో రావిర్యాల నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు రూ.1,665 కోట్లతో చేపట్టనున్న 19.20 కి.మీ., రోడ్డును రిత్విక్ సంస్థ, రెండో దశలో మీర్‌ఖాన్‌పేట్ నుంచి ఆమనగల్ వరకు చేపట్టనున్న 22.3 కి.మీ. రోడ్డును ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.2,365 కోట్లకు దక్కించుకున్నాయి. భూ సేకరణ, టెండర్ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా ఇటు నుంచి మన్ననూర్ వరకు కొత్త రోడ్డును విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న రావిర్యాల– ఆమనగల్ (ఆకుతోటపల్లి), ఆర్‌ఆర్‌ఆర్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నుంచి అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి (మన్ననూర్) వరకు కొత్త రోడ్డు ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన డిజైన్‌ను సంబంధిత అధికారులు సిద్ధం చేస్తున్నారు. జూపల్లి– చారకొండ మధ్య నుంచి భైరాపూర్, డిండి తూర్పుభాగం మీదుగా గువ్వలోనిపల్లి, రాయిచేడ్, బుడ్డతండా, బ్రాహ్మణపల్లి వరకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ సుమారు 50 కి.మీ., దూరం అవుతుంది. ప్రతిపాదిత రోడ్డు ఏర్పాటైతే హైదరాబాద్– శ్రీశైలం మధ్య 40 కి.మీ., దూరం తగ్గడంతోపాటు రెండు గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్– శ్రీశైలం హైవేలోని తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, నంద్యాల వరకు తిరుపతి మార్గంగా, రావిర్యాల నుంచి మన్ననూర్ వరకు శ్రీశైలం రహదారులు వేరు కానున్నాయి. కొత్త రహదారితో ట్రాఫిక్ సమస్య తీరనుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఎలివేటెడ్ కారిడార్‌కు సుముఖత..
హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. రూ.7,700 కోట్ల అంచనాలతో చేపట్టే ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే శ్రీశైలం రహదారి రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ మార్గంలో ఏపీలోని కృష్ణపట్నం రేవుతోపాటు మార్కాపురం, కంభం, కనిగిరి, నెల్లూరు, తిరుపతికి రాకపోకలు సులువు అవుతాయి. ఇప్పటికే పలు ప్రతిపాదనలు రూపొందించగా.. 62.5 కి.మీ., ఎలివేటెడ్ కారిడార్‌లో 56.2 కి.మీ., అటవీ మార్గం, 6.3 కి.మీ., అటవీయేతర ప్రాంతం. స్వల్ప మార్పులతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు మన్ననూర్, వటువర్లపల్లి వద్ద ఎక్కి, దిగేందుకు ర్యాంపుల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి అమ్రాబాద్ మండలం మన్ననూర్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టు వరకు నాలుగు వరుసలతో 30 అడుగల ఎత్తులో ఈ రహదారిని నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈగలపెంట (కృష్ణగిరి)– సున్నిపెంట మధ్య ఉన్న డ్యాంపై ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు. దీంతో తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ మధ్య గంట ప్రయాణ సమయం, 9 కి.మీ.. దూరం తగ్గే అవకాశం ఉంది. అయితే కేంద్ర అటవీశాఖ అనుమతుల కోసం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఫ్యూచర్ సిటీ నుంచి మన్ననూర్ వరకు అనుసంధానం
రావిర్యాల– ఆమనగల్– మన్ననూర్ నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు ప్రతిపాదనలు
మన్ననూర్– శ్రీశైలం మార్గంలో ఎలివేటెడ్ కారిడార్
హైదరాబాద్– శ్రీశైలం మార్గంలో 40 కి.మీ., తగ్గనున్న దూరం