సేవా దృక్పథం అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సేవా దృక్పథం అలవర్చుకోవాలి

Oct 6 2025 2:12 AM | Updated on Oct 7 2025 4:01 PM

-

గద్వాలటౌన్‌ : విద్యార్థులకు చదువుతో పాటు సేవా దృక్పథం అలవర్చుకోవాలని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వీరన్న పేర్కొన్నారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌–1, 2 ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని గుంటిపల్లి, కొత్తపల్లి గ్రామాలలో స్పెషల్‌ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండే సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజలను పట్టిపీడిస్తున్న సామాజిక రుగ్మతలపై చైతన్యం కలిగించాలన్నారు. అంతకుముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు పవన్‌కుమార్‌, వీరేశం తదితరులు పాల్గొన్నారు.

యువతి మృతికి కారకుడిని అరెస్టు చేయాలి

గద్వాల: ప్రేమపేరుతో మోసం చేసి యువతి మృతికి కారకులైన చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ రఘునాథ్‌గౌడ్‌ను వెంటనే అరెస్టు చేయాలని దళిత, ప్రజాల సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్మృతివనంలో విలేకరులతో మాట్లాడారు. గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్‌గౌడ్‌, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రియాంకను ప్రేమిస్తున్నా అని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తరువాత మోసం చేశాడని, దీనిపై గతంలోనే ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. ఈమేరకు చీటింగ్‌ కేసు నమోదు కాగా రఘునాథ్‌గౌడ్‌ జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. 

అప్పటి నుంచి ప్రియాంక రఘునాథ్‌గౌడ్‌ ఇంట్లోనే నివసిస్తుందన్నారు. ఇదిలా ఉండగా పెళ్లికి నిరాకరిచండంతో రెండు రోజుల కిందట పురుగు మందు తాగి ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. ఈకేసులో నిందితుడిని గతంలోనే కఠినంగా శిక్షించి ఉంటే ప్రియాంక ఆత్మహత్య చేసుకుని ఉండేది కాదన్నారు. ఇప్పటికై న పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్‌, వాల్మీకి, రాజు, సునందం, ప్రవీణ్‌, వేమన్న సాదతుల్లా పాల్గొన్నారు.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

రాజోళి: కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీదే హవా అని బీజేపీ జిల్లా ఎన్నికల కన్వీనర్‌ రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం రాజోళిలో మండల అధ్యక్షుడు శశికుమార్‌ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెజార్టీ స్థానాల్లో బీజేపి గెలుపు తథ్యమని, మిగతా రెండు పార్టీలు కలిసినా బీజేపి మెజార్టీకి దరిదాపులకు రాలేవని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం ఉన్న రేవంత్‌ సర్కారు చేత కాని పాలనలో ప్రజలు, గ్రామాలు అభివృద్ధికి దూరమయ్యారని ఆయన అన్నారు. 

సంక్షేమ పథకాలకు చరమ గీతం పాడిన ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగే దైర్యం కూడా చేయలేదని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలలను మోసం చేసిన గత పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అన్ని రంగాలు, వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని, వీటిని ప్రజలకు వివరించాలని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ రెడ్డి,నర్సింహులు,ఈసీ అంజనేయులు,రాజేష్‌, కొంకతి రాము,దస్తగిరి, బీమన్న,మధు,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

రామన్‌పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం

మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం సముద్రమట్టానికిపైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. అలాగే జలాశయం నుంచి ఎన్టీఆర్‌ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 757 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు.

సేవా దృక్పథం  అలవర్చుకోవాలి 1
1/1

సేవా దృక్పథం అలవర్చుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement