బీసీ జోష్‌..! | - | Sakshi
Sakshi News home page

బీసీ జోష్‌..!

Oct 5 2025 2:28 AM | Updated on Oct 5 2025 2:28 AM

బీసీ

బీసీ జోష్‌..!

42 శాతం రిజర్వేషన్లతో వెనుకబడిన వర్గాల్లో ఉత్సాహం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో ఆ వర్గంలో జోష్‌ నెలకొంది. గత ఎన్నికలతో పోలిస్తే 20 శాతం మేర ప్రాతినిధ్యం పెరగనుండడంతో వారిలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. వార్డు, సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2019 స్థానిక ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 22 శాతం రిజర్వేషన్‌ కల్పించగా.. ఆ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటడంతోపాటు జనరల్‌ స్థానాల్లోనూ బరిలో నిలిచి విజయం సాధించారు. తాజాగా బీసీ రిజర్వేషన్ల పెంపుతో రాజకీయ పార్టీల్లో కుల సంఘాలకు మరింత ప్రాధాన్యం పెరిగింది.

జనరల్‌ స్థానాల్లోనూ హవా..

గత ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో 1,690 సర్పంచ్‌ స్థానాలు ఉండగా.. 406 బీసీ రిజర్వ్‌ అయ్యాయి. వీటితోపాటు మరో 238 జనరల్‌ స్థానాల్లోనూ వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు విజయం సాధించారు. అంటే మొత్తంగా 644 మంది బీసీలు సర్పంచ్‌లుగా గెలుపొందారు.

● 2019 స్థానిక ఎన్నికల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో మొత్తం 788 ఎంపీటీసీ స్థానాలు కాగా.. ఇందులో 217 స్థానాలను బీసీలకు కేటాయించారు. వీటితోపాటు మరో 125 జనరల్‌ స్థానాల్లోనూ బీసీలు సత్తా చాటారు. మొత్తంగా 342 మంది బీసీలు ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించారు.

● గత ఎన్నికల్లో మొత్తం 71 జెడ్పీటీసీ స్థానాల్లో 20 వెనుకబడిన వర్గాలకు రిజర్వ్‌ అయ్యాయి. వీటితోపాటు మరో ఆరు జనరల్‌ స్థానాల్లోనూ బీసీలు గెలుపొందారు. మొత్తంగా 26 మంది బీసీ నాయకులు జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు.

జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే..

2019 స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన బీసీలు, ప్రస్తుత ఎన్నికల్లో ఆ వర్గానికి రిజర్వేషన్లను పరిశీలిస్తే సర్పంచ్‌, ఎంపీటీసీల మధ్య పెద్దగా తేడా లేదు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 644 మంది బీసీలు సర్పంచ్‌లుగా ఎన్నిక కాగా.. ప్రస్తుత ఎన్ని కల్లో 621 స్థానాలు మాత్రమే ఆ వర్గానికి రిజర్వ్‌ అయ్యాయి. గత ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తంగా 342 మంది బీసీలు విజయం సాధించగా.. ఈసారి ఆ వర్గానికి 341 స్థానాలు రిజర్వ్‌ అయ్యాయి. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మాత్రం రిజర్వేషన్లు బీసీలకు కలిసివచ్చాయి. గత ఎన్నికల్లో రిజర్వ్‌ అయిన వాటితోపాటు జనరల్‌ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందిన బీసీల లెక్క (మొత్తం 26 స్థానాలు)తో పోలిస్తే.. ఈసారి కేటాయించిన రిజర్వేషన్‌ ప్రకారం మరో ఏడు స్థానాల్లోనూ ఆ వర్గాల ప్రాతినిధ్యం పెరగనుంది. మొత్తంగా గత జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 20 స్థానాలు రిజర్వ్‌ కాగా.. ఈసారి 33 స్థానాలను కేటాయించారు. ఈ లెక్కన 13 స్థానాలు పెరిగాయి.

కుల సంఘాలకు బాధ్యతలు..

బీసీ రిజర్వేషన్లపై ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పు ఎలా వస్తుందనే అంశంపై ఉత్కంఠతోపాటు సందిగ్ధం నెలకొన్నా.. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అయితే బీసీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో ఆశావహులు అధిక సంఖ్యలో ఉండడం.. తగ్గిన అన్‌ రిజర్వ్‌డ్‌ (జనరల్‌) స్థానాల్లో అభ్యర్థిత్వాల కోసం ఆయా వర్గాలకు చెందిన వారు పోటీ పడుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి నెలకొంది. గ్రామాలు, మండలాల వారీగా ఆశావహులు ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కుల సంఘాలకు ప్రాధాన్యం పెరిగినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం పార్టీదే అయినప్పటికీ.. రిజర్వేషన్లకు అనుగుణంగా పలు ప్రాంతాల్లో గెలుపొందే అభ్యర్థుల వడపోత బాధ్యతలను పలు నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు తమకు అనుకూలంగా ఉన్న కుల సంఘాల నాయకులకు అప్పగించినట్లు సమాచారం.

గత స్థానిక ఎన్నికలతో పోలిస్తే 20 శాతం అధికం

2019లో జనరల్‌ స్థానాల్లోనూ వారిదే హవా

జెడ్పీటీసీ స్థానాలు మాత్రమే ఆశాజనకం

రాజకీయ పార్టీల్లో కుల సంఘాలకు పెరిగిన ప్రాధాన్యం

బీసీ జోష్‌..!1
1/1

బీసీ జోష్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement