
అంగరంగ వైభవంగా..!
జిల్లాలో ఘనంగా విజయదశమి వేడుకలు
● అలంపూర్ జోగుళాంబ ఆలయ సన్నిధి, జములమ్మ ఆలయంలో ఉట్టిపడిన దసరా శోభ
● భక్తిశ్రద్ధలతో శమీ పూజలు
గద్వాలటౌన్: చెడుపై మంచికి విజయం.. దుష్టశిక్షణ శిష్టరక్షణ..కోటి ఆశలతో కొంగొత్త జీవితాలకు శ్రీకారం.. శమీపూజల సందడి.. సరదా సరదాగా దసరా సంబరం.. ఆశ్వీయుజ మాసం దశమిని పురస్కరించుకొని గురువారం గద్వాలలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతంలో అర్జునుడు చేసిన శమీ పూజలు గుర్తు చేసుకుంటూ పూజలు చేశారు. శమీ ఆకులను(బంగారం) ఇచ్చి ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అలంపూర్ జోగుళాంబ సన్నిధిలో దసరా శోభ ఉట్టిపడింది. మల్దకల్ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వరస్వామి అలయం, పాగుంట శ్రీవెంకటేశ్వర ఆలయం, బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం, చింతరేవుల ఆంజనేయస్వామి ఆలయాలలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా చేపట్టారు. ఆయా ఆలయాల దగ్గర శమీపూజ, పల్లకి సేవ నిర్వహించారు. ఉదయం ఇంటిల్లి పాదీ కొత్త దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి పూజలు, అర్చనలు నిర్వహించారు. దుర్గా మాత మండపాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని గుంటి చెన్నకేశవస్వామి ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో చేరి పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న శమీవృక్షం (జమ్మిచెట్టు) చుట్టూ ప్రదక్షణలు నిర్వహించి పూజలు చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో 9 రోజుల పాటు పూజలందుకున్న స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. కోట నుంచి గుంటి చెన్నకేశవస్వామి ఆలయం వరకు ఉత్సవ మూర్తులతో ఊరేగింపు నిర్వహించారు.
గద్వాల సంస్థానాఽధీశుల వారసుడు
కృష్ణరామభూపాల్‌కు స్వాగతం పలుకుతూ..
కనులపండువగా తెప్పోత్సవం
ఉత్సవాలను పురస్కరించుకొని నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ పుష్కర ఘాట్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి తెప్పోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్త జన సందోహంతో గద్వాల పులకించింది. గురువారం రాత్రి 7గంటల ప్రాంతంలో పండితులు పూజలు నిర్వహించి వైభవంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అంతకుముందు అమ్మవారి ఊరేగింపునకు ముందు భజన మండలి సభ్యులు భక్తి గీతాలు పాడుతూ సాగారు. విద్యుద్దీపాకాంతులతో సుందరంగా అలంకరించిన పుష్కర ఘాట్‌లో నిర్వహించిన అమ్మవారి తెప్పోత్సవం వేడుకల్లో పాల్గొని భక్తులు తరించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు తెప్పోత్సవ వేడుకల్లో పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంగరంగ వైభవంగా..!