
రహదారులే గోదారులు..
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలో చిరు జల్లులు పడితే చాలు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతాయి. సోమవారం మధ్యాహ్నం, సాయంత్రం కురిసిన ఓ మోస్తరు వర్షానికి పట్టణంలోని అనేక ప్రాంతాలు నీటితో నిలిచి గోదారిని తలపించాయి. కూరగాయల మార్కెట్, రథశాల, రాజీవ్‌మార్గ్, సోమనాద్రి స్టేడియం తదితర ప్రాంతాలలో నీరు నిలవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. వాహనదారులు, పాదచారులు వర్షం ధాటికి ఇబ్బందులు పడ్డారు. చెత్త మురుగుతో కలిసి వర్షపునీరు రోడ్లపై పారింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నిలిచిన వర్షపు నీళ్లతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై పేరుకుపోయిన వర్షపు నీటిని, మురుగును సకాలంలో తొలగించి చర్యలు తీసుకోవాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. అలాగే, సంతలో చిరువ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బురద నీటిలోనే కూర్చొని వ్యాపారాలను నిర్వహించుకున్నారు. దుస్తుల వ్యాపారులు తమ గుడారాలను తొలగించుకున్నారు. ముఖ్యంగా కూరగాయల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. సంత జరుగుతున్న తేరుమైదానం వర్షం నీటితో బురదమయంగా మారింది. బురద నీటిలోనే కూరగాయలను విక్రయించారు. కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం సంత వ్యాపారులకు నష్టాన్ని, కష్టాన్ని మిగిల్చింది.