
దుర్గమ్మ తల్లి
కరుణించవమ్మా..
● వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
గద్వాలటౌన్: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. ఆది పరాశక్తి.. అందరినీ చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు అమ్మవారిని కొలిచారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 7వరోజు ఆదివారం అమ్మవారు వివిధ ఆలయాలలో ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున నుంచే ఆలయాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఆలయాలలో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో, శ్రీశక్తిస్వరూపిణి తాయమ్మ ఆలయంలో అమ్మవారు శ్యామలదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయం ప్రాంగణంలో మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. జములమ్మ ఆలయంలో అమ్మవారు గాయత్రీదేవి, పిల్లిగుండ్లలోని శ్రీశివ కామేశ్వరి దేవి అమ్మవారు చంద్రవాహిని, మార్కండేయస్వామి ఆలయంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరిదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు దుర్గామాత విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను వాహనంపై ఊరేగించారు.