చేతులెత్తేశారు..! | - | Sakshi
Sakshi News home page

చేతులెత్తేశారు..!

Sep 29 2025 9:54 AM | Updated on Sep 29 2025 9:54 AM

చేతుల

చేతులెత్తేశారు..!

రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టా.. పంట మధ్యలోనే వదిలేశా

తేల్చని లెక్కలు.. అయోమయంలో రైతులు

ప్రకృతి కన్నెర్ర

సంక్షోభంలో సీడ్‌ పత్తి సాగు

పెట్టుబడుల కోసం రైతుల వెంపర్లాట

అప్పు చేసి మరీ కూలీలు

చెల్లిస్తున్న వైనం

జిల్లా వ్యాప్తంగా

31,469 ఎకరాల్లో సాగు

గతేడాది చెల్లింపుల లెక్కలు

చేయడంలో ఆర్గనైజర్ల తాత్సారం

అధిక వర్షాలతో పంటపై మరింత దెబ్బ

ఎకరా విస్తర్ణంలో సీడు పత్తి సాగు చేశా. మొదట్లో కొంత మేర పెట్టుబడికి ఆర్గనైజర్లు డబ్బులిచ్చారు. క్రాసింగ్‌ పనుల సమయంలో డబ్బులు ఇవ్వలేక పోవడంతో మధ్యలోనే క్రాసింగ్‌ పనులను నిలిపి వేయాల్సి వచ్చింది. కూలీలకు డబ్బులు ఇవ్వలేక ఎక్కువ రోజులు క్రాసింగ్‌ పనులు చేయకుండా మధ్యలోనే ఆపేశాను. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు చూడలేదు. ఇప్పటి దాకా సీడ్‌ పత్తి సాగుకు 80 వేల వరకు ఖర్చు చేశారు. దీనికితోడు ముసురు వర్షాలు పంటను తీవ్రంగా దెబ్బతీశాయి.

– గోపాల్‌, సీడ్‌పత్తి రైతు, రాయాపురం

సీడ్‌ పత్తి సాగును మధ్యలోనే వదులు కోవాల్సి వచ్చింది. ఎకరా విస్తర్ణంలో సీడ్‌ పత్తిని సాగు చేశా. ఇప్పటి దాకా రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టాను. క్రాసింగ్‌ పనుల కోసం కూలీలను రప్పించుకున్నా. తీరా ఆర్గనైజర్‌ డబ్బులు ఇవ్వకపోవడంతో క్రాసింగ్‌ పనులను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. కూలీలకు మరో చోట అప్పులు చేసి చెల్లించాల్సి వచ్చింది. దీనికితోడు ఎడతెరపి లేని వర్షాలు పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

– వార్ల రాజు, రైతు గట్టు

గట్టు: నడిగడ్డలో పత్తివిత్తనోత్పత్తిని సాగు చేసే రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఓ వైపు ప్రకృతి.. మరో వైపు మధ్యవర్తులు (ఆర్గనైజరు) పత్తివిత్తనోత్పత్తి రైతులకు కునుకు లేకుండా చేస్తున్నారు. ఒకప్పుడు సీడ్‌ పత్తి సాగు చేసే రైతులు పంట నిమిత్తం అప్పు కోసం వెళ్తే.. ఆర్గనైజర్లు ఇట్టే డబ్బులిచ్చేవారు. ఇప్పుడు ఎదురుపడితే ఎక్కడ డబ్బులు అడుగుతాడోనని కొందరు తప్పించుకు తిరిగే పరిస్థితి నెలకొంది. నేరుగా కలిసినా డబ్బులు ఇవ్వలేమంటూ చేతులెత్తుస్తున్నారు. దీంతో పత్తి రైతులు పత్తివిత్తనోత్పత్తి సాగును చివరివరకు కొనసాగిద్దామా లేక మధ్యలోనే వదిలేద్దామా అనే సందిగ్ధంలో పడ్డారు. పెట్టుబడులకు డబ్బులు లేక కొంత మంది సీడ్‌ పత్తి సాగును మధ్యలోనే వదిలేస్తుండగా మరి కొంత మంది రైతులు మరో చోట అప్పులు తెచ్చుకుని సాగు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 31,469 ఎకరాల్లో సీడ్‌ పత్తిని సాగు చేస్తున్నట్లు అంచనా. రైతులకు సుమారుగా రూ.550 కోట్ల నుంచి రూ.650 కోట్ల వరకు మధ్యవర్తుల ద్వారా కంపెనీలు రైతులకు చెల్లించాల్సి ఉండగా, ఇందులో ఇప్పటికే కంపెనీలు మధ్యవర్తుల ద్వారా రైతులకు రూ.350 కోట్లను వరకు మాత్రమే చెల్లించి, మిగతా రూ.300 కోట్ల చెల్లింపుల గురించి మాట్లాడకుండడంతో రైతులు ఏం దిక్కుతోచని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు.

కూలీలకు డబ్బులు కరువు

ఈ ఏడాది సీడ్‌ పత్తిని సాగు చేసిన రైతులు పెట్టుబడికి చాలా ఇబ్బంది పడుతున్నారు. క్రాసింగ్‌ పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి రప్పించుకున్న కూలీలకు డబ్బులు చెల్లించాలని, డబ్బులు ఇవ్వమని ప్రాదేయపడుతున్నా..అబ్బే మా దగ్గర డబ్బుల్లేవంటూ ఆర్గనైజర్లు తప్పించుకుని తిరిగే పరిస్థితి నడిగడ్డలో దాపురించింది. దీంతో 60 రోజుల పాటుగా క్రాసింగ్‌ పనులను సాగించాల్సిన రైతులు 30 నుంచి 40 రోజుల వరకు పనులు చేసి, కూలీలను వెనక్కి పంపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రప్పించుకున్న కూలీలకు భోజనం, వసతితో పాటుగా ఒక్కోక్కరికి రూ.18 వేల నుంచి 21 వేలను 30 రోజులకు చెల్లిస్తుంటారు. కూలీలకు డబ్బులు ఇవ్వలేక రైతులు నానా తంటాలు పడుతున్నారు.

సీడ్‌ పత్తిని సాగు చేసిన రైతులు తాము పండించిన పత్తిని నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో మిల్లులో జిన్నింగ్‌ ఆడిస్తారు, పత్తి నుంచి గింజలను బయటకు తీసిన తర్వాత, వాటిని రైతుల సమక్షంలో శ్యాంపిల్స్‌ తీసి కంపెనీకి పంపుతారు. సంక్రాంతి నాటికి ప్రక్రియను పూర్తి చేస్తారు. అయితే రైతులకు చెల్లించాల్సిన డబ్బులను మాత్రం జూలైలో లెక్కలు చేస్తారు. పంట సాగు కోసం తీసుకున్న అప్పు, దానికి వడ్డీ కలిపి లెక్కకడతారు. తాము పండించిన పంటకు చెల్లించాల్సిన డబ్బులను లెక్క చేసి, మిగులుబాటు ఉంటే రైతులకు చెల్లింపులు చేస్తారు. లేకపోతే కొంత మేరకు పెట్టుబడికి ఇచ్చి, పంట పండించాలని రైతులకు చెబుతారు. అయితే 2024–25 సంవత్సరానికి సంబందించి సీడ్‌ ఆర్గనైజర్లు కొంత మంది రైతుల లెక్కలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ ఏడాది సీడ్‌ పత్తి రైతుపై ప్రకృతి పగ పట్టిందని రైతులు వాపోతున్నారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. క్రాసింగ్‌ కొనసాగుతున్న తరుణం (ఆగస్టు/సెప్టెంబర్‌) లో వర్షాలు విరామం లేకుండా కురువడంతో క్రాసింగ్‌ నిలవడం లేదని పేర్కొంటురు. ప్రస్తుతం ముందస్తు చేసిన క్రాసింగ్‌ పనుల కారణంగా సీడ్‌ పత్తి కాయలు పగిలి పత్తి తీసేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో వర్షాల కారణంగా పత్తి తడిచి దెబ్బతింటున్నట్లు రైతులు లబోదిబోమంటున్నారు. వర్షాలు ఎక్కువ కావడంతో పత్తి చేను ఎర్రబారి దిగుబడిపై ప్రబావం చూపుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చేతులెత్తేశారు..! 1
1/2

చేతులెత్తేశారు..!

చేతులెత్తేశారు..! 2
2/2

చేతులెత్తేశారు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement