
రిజర్వాయర్ గండికి మట్టి తరలింపు
● నిలిచిన వర్షం.. ఊపిరి పీల్చుకున్న మూడు గ్రామాల రైతులు
గట్టు: వర్షాలు నిలిచినప్పటికి చిన్నోనిపల్లె రిజర్వాయర్‌లోకి వాగులు, వంకల్లో నుంచి నీటి ఉధృతి కొనసాగుతోంది. శని, ఆదివారం రెండు రోజుల పాటు రిజర్వాయర్ గండిని పూడ్చిన చోట మట్టిని తరలించి ఎత్తును పెంచారు. భారీ వర్షాలకు చిన్నోనిపల్లె రిజర్వాయర్ గండి దగ్గర పూడ్చిన మట్టికి సమాంతరంగా రిజర్వాయర్ నీరు వచ్చి చేరారు. వర్షాలు ఇలాగే కొనసాగి ఉంటే గండిని పూడ్చిన చోట రిజర్వాయర్ కట్ట కోతకు గురై నీరంతా బయటకు వెళ్లేది. చిన్నోనిపల్లె, లింగాపురం, బోయలగూడెం గ్రామాలకు చెందిన రైతులు చిన్నోనిపల్లె రిజర్వాయర్ వద్దకు చేరుకుని మట్టి కట్ట తెగిపోకుండా మట్టిని తరలించే విధంగా అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఇంజినీరింగ్ అధికారులు రెండు రోజులపాటు చిన్నోనిపల్లె రిజర్వాయర్ గండి పూడ్చిన చోట మరికొంత మట్టిని తరలించి, కట్ట ఎత్తు పెంచారు. వరుణుడు శాంతించడంతో రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరగకుండా సమాంతర కాల్వ ద్వారా రిజర్వాయర్ నీరు బయటకు వెళ్లిపోతుండడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. రిజర్వాయర్‌లో నీటి మట్టం క్రమంగా పెరగడంతో చిన్నోనిపల్లె గ్రామంలోని ఇళ్ల మధ్యకు బ్యాక్ వాటర్ వచ్చి చేరాయి. గ్రామ శివారుల్లో రైతులు సాగు చేసుకున్న పంట పొలాల్లోకి రిజర్వాయర్ నీరు వచ్చి చేరి, పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ముంపునకు గురైన చిన్నోనిపల్లె గ్రామస్తులు పునరావాస కేంద్రంలో ఇప్పుడిప్పుడే ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కొందరు తాత్కాలికంగా రేకుల గుడిసెలను వేసుకుని తలదాచుకుంటుండగా, మరికొంత మంది పాత గ్రామంలోని పాత ఇళ్లల్లోనే నివాసం ఉంటున్నారు. పాత ఊరిని పూర్తి స్థాయిలో ఖాళీ చేసి, పునరావాస కేంద్రంలోకి మారితే, రిజర్వాయర్ మిగిలిన పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీటితో నింపేందుకు అవకాశం ఉంటుంది.

రిజర్వాయర్ గండికి మట్టి తరలింపు