
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి
గద్వాలటౌన్: తన జీవితాన్ని చివరి వరకు ప్రజా పోరాటాలకు అంకితం ఇచ్చిన ధీశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పలువురు వక్తలు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లావ్యాప్తంగా పద్మశాలి సంఘం నాయకులు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు వేరువేరుగా కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసి తన జీవితాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానీయుడు బాపూజీని కొనియాడారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర సమరం, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు మాట్లాడుతూ.. చేనేతతో పాటు వివిధ చేతివృత్తుల వారికి కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ఉద్యమాలు నిర్వహించారన్నారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాత అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.