
ఏటీసీల్లో కార్పొరేట్ స్థాయి నైపుణ్య శిక్షణ
గద్వాల టౌన్: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు అధునాతన సాంకేతిక శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని కలెక్టర్ సంతోష్ తెలిపారు. శనివారం పట్టణ శివారులోని నూతన ఏటీసీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. యువత అడ్వాన్డ్‌స్ టెక్నాలజీ సెంటర్‌లో శిక్షణ పొంది, ఆధునిక నైపుణ్యాలను అభ్యసించి, భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందించేందుకు టాటా సంస్థ సహాకారంతో వివిధ కోర్సులు నేర్పిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఏటీసీలో 172 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.45 కోట్ల వ్యయం చేసిందని, ప్రతి విద్యార్థికి వచ్చే ఏడాది నుంచి రూ.2 వేల స్టైఫండ్ అందిస్తామన్నారు. యువత నైపుణ్యం పెంచుకోవడానికి ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేసి ఏటీసీలో చదివిన ప్రతి ఒక్కరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సైతం అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో సహాయ లేబర్ కమిషనర్ మహేష్‌కుమార్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిణి ప్రియాంక, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.