
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ
గద్వాలటౌన్: అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలను పట్టణంలోని పలు ఆలయాల్లో శనివారం వైభంగా నిర్వహించారు. ఆరో రోజు స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు బాలరాముడు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గద్వాల ఇలవేల్పు జములమ్మ ఆలయంలో అన్నపూర్ణేశ్వరి దేవిగా, తాయమ్మ ఆలయం, కుమ్మరివీధి, అంబాభవాని ఆలయం, వీరభద్రస్వామి ఆలయంలో, మార్కండేయస్వామి ఆలయంలో అమ్మవారు వివిధ రూపాల అలంకరణలో దర్శనమిచ్చి కనువిందు చేశారు. బాలాజీ వీధుల్లో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను వాహనంపై ఊరేగించారు.