
ఎడతెరిపి లేకుండా..
గురువారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం
గద్వాల: జిల్లా వ్యాప్తంగా గురువారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న ఏకధాటి వర్షానికి జనజీవనం అతాకుతలం అయ్యింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ ఏడాదిలో తొలిసారిగా కృష్ణానది పొంగి ప్రవహిస్తుండడంతో గుర్రంగడ్డలోని జములమ్మ అమ్మవారి ఆలయంలోకి నీరువచ్చి చేరింది. అదేవిధంగా చెరువులు, కుంటలు వాననీరు చేరి నిండుకుండలుగా మారాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ టి.శ్రీనివాస్‌రావు.. రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బందితో నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడెక్కడ ప్రమాదాలు చోటుచేసుకుంటాయో వాటిని ముందుస్తుగానే గుర్తించి ఆయాప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశించారు. జిల్లాలో గద్వాల మండలంలో గరిష్టంగా 23.2 మి.మీ, మానవపాడులో కనిష్టంగా 7.2 మి.మీ.ల వర్షం కురిసింది.
పంటలకు తీరని నష్టం
కేటీదొడ్డి మండలంలో చేతికొచ్చే దశలో ఉన్న పత్తి పంటను వర్షం తీవ్రంగా దెబ్బతీసింది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పత్తి పంటకు నష్టం వాటిల్లే అవకాశముందని రైతులు ఆవేదన చెందారు. అలాగే,మానవపాడులో కురిసిన భారీ వర్షానికి పంట పొలాల్లో వర్షం నీరు చేరడంతోతీవ్ర నష్టం వాటిలింది. మండలంలోని మిరప, పత్తి, కంది, పొగాకు పంటలకు ఎడతెరిపి లేని వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ధరూరు మండలంలో ముసురు వర్షానికి జనం ఇళ్లకే పరిమితమయ్యారు. పాత ఇళ్లల్లో నివాసం ఉంటున్న వారు భయం భయంగా కాలం గడిపారు. వ్యవసాయ పనులకు, ముఖ్యంగా సీడ్ పత్తి పనులకు ఆటంకం కలిగింది.
మల్దకల్ మండలంలో భారీ వర్షానికి అమరవాయి గ్రామంలో దౌలత్‌బేగ్ ఇల్లు నేలకూలింది. అలాగే బిజ్వారం, మేకలసోంపల్లి, మల్దకల్, తాటికుంట, చర్లగార్లపాడు గ్రామాలలో వర్షానికి పాడుబడిన ఇళ్లు కూలినట్లు గ్రామస్తులు తెలిపారు.
అయిజ మండలంలోని అయిజ, ఉత్తనూరు, సింధనూరు, దేవబండ వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పట్టణంలోని లోతట్టు కాలనీల రోడ్లు వర్షంనీటిలో మునిగిపోయాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
రాజోళి మండలంలో వర్షం దంచి కొట్టింది. కొన్ని గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ జలమయమై, కనీసం నడవడానికి కూడా రాని విధంగా తయారయ్యాయి. రాజోళి–శాంతిగనర్ ప్రధాన రోడ్డుపై మోకాలి లోతు గుంతలు ఏర్పడి నారు చేరడంతో స్థానికులు, బీజేపి నాయకులతో కలిసి తమ ఇబ్బందిని కలెక్టర్‌కు వాట్సాప్ ద్వారా తెలియచేశారు.
జిల్లా వ్యాప్తంగా పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ
గద్వాలలో గరిష్టంగా 23.2 మి.మీ, మానవపాడులో 7.2 మి.మీ వర్షం

ఎడతెరిపి లేకుండా..