
చెక్‌డ్యాంలకు గ్రహణం
● రూ.లక్షలు వెచ్చించి నిర్మాణం
● సైడ్‌వాల్స్ కొట్టుకుపోయి నీటి వృథా
● మరమ్మతుకు నోచుకోని వైనం
అయిజ: వర్షంనీరు ఒడిసి పట్టుకొని వాగులు, వంకల్లో నీరు నిలువ చేసి.. భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా చెక్‌డ్యాంలను నిర్మించారు. ఏళ్లు గడుస్తున్న కొద్ది సైడ్‌వాల్స్ కొట్టుకుపోవడం.. మరమ్మతుకు నోచుకోకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. దీనికితోడు అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఈ నీటిపై ఆధారపడే రైతులు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. 2001లో కేంద్ర ప్రభుత్వం నాబర్డ్ పథకం ద్వారా జిల్లాలోని వాగులు, వంకల వద్ద చెక్‌డ్యాంలను నిర్మించింది. ఒక్కో చెక్‌డ్యాంకు రూ.5 లక్షలు ఖర్చుచేసింది. జిల్లాల పునర్విభజన అనంతరం జిల్లా పరిధిలోకి మొత్తం 20 చెక్ డ్యాంలు వచ్చాయి. వాటిలో 7 చెక్‌డ్యాంలు శిథిలమయ్యాయి. 2009లో వచ్చిన వరదల్లో చెక్‌డ్యాంల సైడ్‌వాల్స్ కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు వాటిని పునర్నిర్మించపోవడంతోపాటు మరమ్మతుకు కూడా నోచుకోవడంలేదు. చెక్‌డ్యాంలు నిర్మించిన అనంతరం కొన్నేళ్లు వాగుల్లో వర్షాకాలం సమృద్ధిగా నీరునిలవడంతో చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరిగాయి. బోరుబావుల్లో తాగునీరు, సాగునీరు సమృద్ధిగా లభించింది. మూగజీవాల దాహం తీర్చేందుకు ఈచెక్‌డ్యాంలు ఉపయోగపడ్డాయి. అయితే 2009, మరికొన్ని సార్లు కురిసిన భారి వర్షాలకు వాగులు పొంగి పొర్లడంతో చెక్‌డ్యాంల సైడ్‌వాల్స్ తెగిపోయాయి. కట్టడాలు శిథిలమయ్యాయి. వాటికి మరమత్తులు చేపట్టకపోవడంతో అప్పటినుంచి ఇప్పటివరకు వాగుల్లో నీరు నిలువని పరిస్థితి ఏర్పడింది. కనీసం పశువులు దాహంతీర్చెకోవడానికి కూడా నీరు నిలువక పోవడం దూరదృష్టకరం. వర్షాకాలంలో వాగులు ఎడారిని తలపిస్తాయి. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి చెక్‌డాంలన్నింటికి మరమత్తులు చేయించాల్సిన అవసరం ఎంతైనాఉంది.
ఉన్నా.. నిరుపయోగం
అయిజ శివారులో మొత్తం 4 చెక్‌డ్యాంలు ఉండగా వాటిలో రెండు శిథిలమయ్యాయి. మానవపాడు మండలంలోని కలుకుంట్ల, మానవపాడు, కొరివిపాడు, జల్లాపూర్, పల్లెపాడు, చందూర్, చిన్న పోతులపాడు, గోకులపాడు, బొరవెల్లి, పెద్ద పోతులపాడు గ్రామ శివార్లలో మొత్తం 13 చెక్ డ్యాంలు ఉండగా వాటిలో 2 చెక్‌డ్యాంలు శిథిలమయ్యాయి. ఇటిక్యాల మండలంలోని ఉదండాపురం– సాతర్ల గ్రామాల మధ్య ఒక్క చెక్‌డ్యాం ఉండగా అది కూడా శిథిలావస్థలో ఉంది. వడ్డేపల్లి మండలంలోని బుడమర్సులో 2 చెక్‌డ్యాంలు మరమ్మతుకు గురయ్యాయి. ఇదిలాఉండగా, రెండేళ్ల క్రితం ప్రభుత్వం జిల్లాలో 7 నూతన చెక్ డ్యాం నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. నందిన్నె శివారులో రూ.1.77 కోట్లు, గుంటిపల్లి శివారులో రూ. 2.06, దయ్యాలవాగు వద్ద రూ.1.96, చందూరులో రూ.1.2, గువ్వలదిన్నెలో రూ.3.7, ఇర్కిచేడులో రూ. 3.85, ఉప్పలలో రూ.2.82 కోట్లతో నూతన చెక్ డ్యాంల నిర్మాణాలు పూర్తయ్యాయి. కానీ, మరమ్మతుకు గురైన చెక్‌డ్యాంలు శిథిలమైనాసరే వాటికి మరమ్మతు చేపట్టడంలేదు.