
నదీపరివాహక ప్రాంతాల్లో రక్షణ
కృష్ణానది, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టారు. గద్వాల పట్టణంలోని నదీఅగ్రహారం, జూరాల, బీచుపల్లి కృష్ణానది వద్ద, తుంగభద్రనది ప్రాంతాల్లో రాజోలి, అలంపూరు ప్రాంతాల్లో పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ప్రధానంగా గద్వాల, కెటి.దొడ్డి, గట్టు, ధరూరు, మానవపాడు ఇటిక్యాల మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో చాలాగ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మానవపాడు నుంచి అమరవాయికి వెళ్లే పెద్దవాగు ప్రవాహం పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణపురం అండర్‌రైల్వే బ్రిడ్జి దగ్గర భారీవర్షానికి నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.