
విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి
గద్వాలన్యూటౌన్: విద్యార్థులు తమతమ లక్ష్యాలను అందుకోవడంలో భాగంగా తల్లిదండ్రులు అవసరమైన ప్రోత్సాహన్ని అందించాలని ఇంటర్‌బోర్డు జాయింట్ డైరెక్టర్ విశ్వేశ్వర్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు అధ్యాపకులతో పాటు, తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుందని చెప్పారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ధేశించుకుని చదివేలా తల్లిదండ్రులు, అధ్యాపకులు ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు ప్రతి రోజు కళాశాలకు వస్తున్నారా.. లేదా.. అని తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. తరుచూ కళాశాలకు వస్తూ తమ పిల్లల ప్రతిభ ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఇక నుంచి తరుచూ పేరేంట్స్ మీటింగ్స్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియేట్ అధికారి హృదయరాజు, ప్రిన్సిపాల్ వీరన్న, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.