
ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ
● కలెక్టర్ బీఎం సంతోష్
● జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన సంబరాలు
గద్వాల/గద్వాలటౌన్: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం.. మన వారసత్వాన్ని కాపాడే.. ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని కలెక్టర్ బీఎం సంతో అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో, కలెక్టరేట్‌లో అట్టహాసంగా బతుకమ్మ వేడులకు నిర్వహించారు. హోదా పక్కన బెట్టి స్వయం సహాయక సంఘాల మహిళలతో జిల్లా అధికారులు.. వారికి జతగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు... కళాకారుల ఆట పాట.. వెరసి బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ సంతోష్ బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. వివిధ శాఖల సిబ్బంది పూలతో బతుకమ్మలను పేర్చగా, జిల్లా అధికారులు బతుకమ్మ ఆడారు. జానపద పాటలతో హోరెత్తించారు. కలెక్టర్ సతీమణి డాక్టర్ కెచేరి బతుకమ్మను నెత్తిపై పెట్టుకొని తన నివాసం నుంచి వచ్చారు. దాండియా ఆడి సందడి చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, ఆర్డీఓ అలివేలు, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి నుషితతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తీరొక్క పూలు.. ఆనందాల జోరు..
జిల్లా కేంద్రంలోని తేరుమైదానంలో గురువారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ బతుకమ్మ వేడుకల్లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన సతీమణి బండ్ల జ్యోతి పాల్గొన్నారు. వివిధ కాలనీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలను తలపై పెట్టుకుని ర్యాలీ నిర్వహించి, తేరువైదానానికి చేరుకున్నారు. పగటి వెలుతురు తలపించేలా సంబురాల వేదిక పరిసరాలను విద్యుత్ వెలుగుతో నింపేశారు. స్థానిక తేరుమైదానం మొత్తం బతుకమ్మ ఆట, పాటలతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలతో కలిసి కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జిల్లా అధికారులు బోడ్డెమ్మలు వేశారు. వారితో కలిసి కోలాటం ఆడారు. సమాజంతో స్నేహబంధాన్ని పెంచుకోవడానికి, సుఖాన్ని కలిసి ఆనందించడానికి తెలంగాణలో బతుకమ్మ ఆడుతారనే సందేశాన్ని ఇచ్చారు. అనంతరం తేరుమైదానం నుంచి తెచ్చిన బతుకమ్మలను స్థానిక లింగం బావిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మలను అందంగా ముస్తాబు చేసి ఆట పాటలతో అలరిచిన మహిళలకు ప్రోత్సాహ బహుమతులను కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అందజేశారు.

ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ