
వైభవంగా జోగుళాంబ నవరాత్రి ఉత్సవాలు
అలంపూర్: దక్షిణకాశీ అలంపూర్ ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు గురువారం జోగుళాంబ అమ్మవారు కుష్మాండదేవిగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. ప్రత్యేక మండపంలో కొలువుదీరిన అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా కుంకుమార్చన, అష్టోత్తర శతనామ అర్చన, దేవి ఖడ్గమాల అర్చన జరిగాయి. కుష్మాండదేవికి కొలువు పూజ, కుమారి పూజ, సువాసిని పూజ, దర్బారు సేవ మంత్ర పుష్ప నీరాజన పూజలు, దశవిధ హారతులిచ్చారు. కుష్మాండం అంటే బ్రహ్మాండానికి సంకేతమని.. జగన్మాత బ్రహ్మాండమంతా తానై భక్తులను రక్షిస్తుందని అర్చకులు భక్తులకు వివరించారు. అలాగే అమ్మవారి ఆలయంలో రథోత్సవం కనులపండవగా జరగగా.. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
పట్టువస్త్రాలు సమర్పించిన ఎస్పీ..
అలంపూర్ ఆలయాలను గురువారం ఎస్పీ శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రాలతో వారిని సత్కరించగా.. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం పలికారు.
నాలుగో రోజు కుష్మాండదేవిగా భక్తులకు దర్శనం
అమ్మవారి ఆలయంలో కనులపండువగా రథోత్సవం
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు..
ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం సికింద్రాబాద్‌కు చెందిన కీర్తి ఆర్ట్స్ అకాడమీ కూచిపూడి నృత్య ప్రదర్శనతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.

వైభవంగా జోగుళాంబ నవరాత్రి ఉత్సవాలు