
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
గద్వాల క్రైం: నవరాత్రి, బతుకమ్మ వేడుకల్లో భక్తులకు ఎలాంటి సమస్య లేకుండా శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని నవరాత్రి వేడుకల సందర్భంగా ఆలయాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని, బతుకమ్మ సంబరాల నేపథ్యంలో మహిళలకు ఇబ్బందులు కలగకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. దాంతోపాటు అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్ధాలు, గంజాయి, పేకాట వంటిని కట్టడి చేయాలని, సరిహద్దు ప్రాంతాల్లో పట్టిష్టమైన నిఘా ఉంచాలన్నారు. కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖాలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని, స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్‌లో నమోదైన కేసులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్‌ఐలు, కళ్యాణ్‌కుమార్, శేఖర్, రాజునాయక్, శ్రీనివాసులు, మల్లేష్, శ్రీహరి, నందికర్ తదితరులు ఉన్నారు.