
వర్షాభావ, విపత్కర పరిస్థితుల్లో..
ఆల్మట్టి ఎత్తు పెంచిన పక్షంలో తెలంగాణతోపాటు ఏపీ రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లుతుంది. తెలంగాణలో ప్రధానంగా కృష్ణా పరివాహకంలోని ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. వర్షాభావ, విపత్కర పరిస్థితుల్లో ఆల్మట్టి గేట్లు తెరవకుంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతోపాటు నెట్టెంపాడు, భీమా–1, 2, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్‌కు కృష్ణా నీరు చేరని పరిస్థితి ఉంటుంది. ఫలితంగా వీటి పరిధిలో సుమారు 20 లక్షల ఎకరాల సాగుపై సందిగ్ధత నెలకొనే అవకాశం ఉంటుందని.. తాగునీటికీ కటకట ఏర్పడుతుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.