ఆగిన మగ్గం చప్పుడు! | - | Sakshi
Sakshi News home page

ఆగిన మగ్గం చప్పుడు!

Sep 25 2025 12:40 PM | Updated on Sep 25 2025 12:40 PM

ఆగిన

ఆగిన మగ్గం చప్పుడు!

చేనేత రంగంపై భారీ వర్షాల ప్రభావం

వాతావరణం

అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతమై

ఉంటుంది. అడపాదడపా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

రాజోళి: నిత్యం చేతిలో పనితో హడావుడిగా ఉండే నేతన్నలు గత నెల రోజుల పైబడి పైసా పని లేక ఉ సూరుమంటున్నారు. ఉదయం లేచింది మొదలు, నిత్యం దారాల అల్లికతో రంగుల కూర్పులతో, మగ్గం చప్పుళ్లతో సాగే చేనేత కార్మిక జీవనం వర్షపు చినుకుల మధ్య ముందుకు సాగలేక స్తంభిస్తుంది. చేనేత మగ్గాలు కావడంతో గుంతల్లో నీరు చేరి పను లు చేసేందుకు వీలులేక దినదినగండంగా గడుపుతున్నారు. గత నెలరోజులుగా కురుస్తున్న వర్షాలకు చేనేత కార్మికులు మరింతగా ఇబ్బందిపడుతున్నారు.

వర్షాకాలంలో సమస్య నిత్యకృత్యం..

గత నెలలో కురిసిన వర్షాల నుంచి బయటపడుతున్నామనుకులోగా మళ్లీ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చేనేత కార్మికులు జీవనం నిలిచింది. జిల్లాలోని గద్వాల, అయిజ, గట్టు, రాజోళిలో ఎక్కువగా చేనేత కార్మికులు ఉన్నారు. వారంతా ఎక్కువగా చేతి మగ్గాలనే వాడుతున్నారు. దీని కోసం గుంతల ద్వారా మగ్గాలను ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈ సమస్య నిత్యకృత్యమైంది. ప్రతి ఏడాది ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతున్నా అధికారులు, నాయకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో కార్మికులు వర్షాకాలం వస్తే బిక్కుబిక్కుమంటూ తమ జీవనాన్ని వెల్లదీస్తున్నారు. జిల్లాలో చేనేత కార్మికులకు వర్షాకాలంలో ఇబ్బందులున్నప్పటికీ కొందరు కార్మికులు మరింత దుర్బర జీవితం గడుపుతున్నారు. గత నెలలో వర్షాలు జోరుగా కురవడంతో మగ్గాలు తడిసి పనులు నిలిచాయి. వాటి నుంచి బయట పడి పనులు చేసుకునేలోగా గత పది రోజలుగా వర్షాలు మళ్లీ కురుస్తుండటంతో కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు.

ఊట గుంతల్లా.. మగ్గం గుంతలు

రాజోళిలో చేనేత కార్మికుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. కొత్త రాజోళిలో నివసిస్తున్న చేనేత కార్మికులు ఉదయం నుంచి రాత్రి దాకా నీరు ఎత్తిపోయడమే పనిగా పెట్టుకోవాల్సి వస్తుంది. కొత్త రాజోళిలో మొత్తం పునరావాస గృహాలే ఉన్నాయి. కాగా ఆ గృహాలు మొత్తం నల్లభూమిలోనే నిర్మించారు. రెండు గదులతో నిర్మించిన ఈ గృహాల్లోనే కార్మికులు ఒక గదిలో మగ్గం గుంతను ఏర్పాటు చేసుకున్నారు. నల్లభూమి కావడంతో నీరంతా గుంతల్లోకి చేరి నిల్వ ఉంటుంది. దీంతో నేసిన చీరలు, నేసేందుకు సిద్ధంగా ఉన్న మెటీరియల్‌ మొత్తం తడిసిపోయి రెండు రకాలుగా కార్మికులు నష్టపోతున్నారు. దీనికితోడు సరైన డ్రైనేజీలు కూడా లేకపోవడం, వర్షపు నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వృథా నీరంతా ఊట రూపంలో మగ్గం గుంతల్లోకి చేరుతుంది. గుంతల నిండా నీరు చేరడంతో చీరలు నేసేందుకు వీలు కావడం లేదు. మగ్గం కూడా మొత్తం తడిసిపోవడంతో వాటిని ఆరబెట్టేందుకు సమయం కావాలని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అది కూడా వీలు కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇళ్ల మధ్య సీసీ రోడ్లు కూడా లేకపోవడంతో నీరు రోడ్లపైన, ఇళ్ల చుట్టుముట్టూ నీరు చేరి కార్మికులకు ఇబ్బందికరంగా మారుతుంది.

దెబ్బ మీద దెబ్బ

చేనేత కార్మికుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది. అసలే కరెంట్‌ మగ్గాల ద్వారా నేసిన చీరలకు గిరాకీ పెరిగి, చేనేత చీరల అమ్మకాలు తగ్గడంతో నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం దసరా పండుగ సీజన్‌ కావడంతో కార్మికులకు చేతి నిండా పనుంటుంది. ఆర్డర్లు ఎక్కువగానే తీసుకుంటారు. కానీ మగ్గం గుంతల్లో నీరు చేరడంతో పనులు నిలిచాయి. తడిచిన మగ్గం మెటీరియల్‌ ఆరి మళ్లీ పనులు మొదలుపెట్టాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది. అంతలోగా వర్షం కురవకుంటే పర్లేదు కాని మళ్లీ వర్షం కురిస్తే పనులకు రోజుల తరబడి అంతరాయం కలుగుతుందని కార్మికులు అంటున్నారు. ఈ కారణంగా పండుగ సీజన్‌లో చీరల ఆర్డర్లు కోల్పోవడంతోపాటు.. ఇటు మెటీరియల్‌ పాడైపోయి.. పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కరెంట్‌ మగ్గాలు అందించడంతోపాటు.. షెడ్లు నిర్మించేందుకు ఆర్థికంగా తోడ్పాటునందించాలని కోరుతున్నారు.

పాలమూరుకు క్రీడాకళ

జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో గురువారం నుంచి రాష్ట్రస్థాయి సీనియర్‌ ఫుట్‌బాల్‌ పోటీలు నిర్వహించనున్నారు.

–IVలో u

మగ్గం గుంతల్లో రోజుల తరబడి నీరు చేరి పనులకు తీవ్ర ఆటంకం

దసరా పండుగ ముందు కార్మికులకు దెబ్బ

వర్షాల కారణంగా స్తంభించిన చేనేత కార్మికుల జీవనం

ఆగిన మగ్గం చప్పుడు!1
1/1

ఆగిన మగ్గం చప్పుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement