
సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి
కేటీదొడ్డి: సరిహద్దు చెక్‌పోస్టులో అప్రమత్తంగా ఉండాలని, అక్రమ రవాణాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండకూడదని ఎస్సీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ మొగులయ్యతో కలిసి ఎస్పీ సందర్శించారు.పోలీసులకు పలు సూచనలు, సలహాలు చేశారు. శాంతిభద్రలలకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ రికార్డులను, యూనిఫాం టర్న్ ఔట్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ముఖ్యంగా రౌడీ షీటర్స్, అనుమానితులపై నిఘా ఉంచడంతో పాటు గ్రామాల్లోని ఎలాంటి సమాచారం అయినా తెలుసుకుని ఉండాలని సూచించారు. స్టేషన్ ఆవరణలో స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను తెలుసుకున్నారు. కేసులు పెండింగ్ లేకుండా చూడడంతో పాటు ఎప్పటి కప్పుడు గ్రామాల్లో గస్తీ నిర్వహించి క్రైం రేటును తగ్గించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అమలు చేయాలని, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా ఒకే చోటు పని చేసే ఉద్యోగులు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలన్నారు. కార్యక్రమంలో సీఐ టంగుటూరి శ్రీను, ఎస్సై శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.