
ఆదిపరాశక్తికి విశేష పూజలు
గద్వాలటౌన్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు లతితాదేవిగా, శ్రీశక్తిస్వరూపిణి తాయమ్మ ఆలయంలో అమ్మవారు శ్రీరాజ రాజేశ్వరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు సామూహికంగా కుంకుమార్చన నిర్వహించారు. జములమ్మ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకరణలో పూజలందుకున్నారు. పిల్లిగుండ్లలోని శ్రీశివకామేశ్వరి అమ్మవారు చంద్రవాహిని రూపంలో, మార్కెండేయస్వామి ఆలయంలో అమ్మవారు గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగించారు. అయ్యప్పస్వామి ఆలయంలో అమ్మవారిని మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఆదిపరాశక్తికి విశేష పూజలు