
నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
శాంతినగర్: జిల్లాలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ టి.శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మొగిలయ్యతో కలిసి సీఐ, ఎస్‌ఐ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అధికంగా నేరాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పార్ట్స్‌గా గుర్తించాలన్నారు. ప్రతి కేసులో పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలని.. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమో దు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. విలేజ్ పోలీసు అధికారులకు కేటాయించిన గ్రామాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలన్నారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. నేరాల నియంత్రణకు ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి.. స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. స్టేషన్ రికార్డులు పార్ట్–1, 5 పెండింగ్ లేకుండా చూడాలన్నారు. సి బ్బందికి వర్టికల్ వారీగా విధులు కేటాయించాలని ఎస్‌హెచ్‌ఓకు సూచించారు. ఎస్పీ వెంట సీఐ టాటాబాబు, ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి ఉన్నారు.