
పకడ్బందీగా వానాకాలం ధాన్యం సేకరణ
గద్వాల: వానాకాలంలో రైతులు పండించిన వరిధాన్యం సేకరణకు అవసరమైన ముందస్తు చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆయన వానాకాలం ధాన్యం సేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోళ్లను వచ్చే నెల రెండో వారం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు ధాన్యం క్లీనర్, కాంటాలు, తేమ యంత్రాలు, అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. అదే విధంగా రైతుల వద్ద సేకరించిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్‌లో నమోదు చేయాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి.. నిఘా ఉంచాలన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులు, పొరపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని.. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్‌ఓ స్వామికుమార్, డీఎం విమల, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.