
అతివలకు ఆరోగ్య భరోసా
ఇటీవల స్వస్త్ నారీ సశక్త్, పరివార్ అభియాన్ ప్రారంభం
● గుండెజబ్బు, క్యాన్సర్, బీపీ, షుగర్ తదితర వాటిపై అవగాహన
● అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలు
● ఉచితంగా మందుల అందజేత
గద్వాల క్రైం: ఓ కుటుంబం శక్తివంతంగా ఉండాలంటే.. ఆ ఇంటి వెలుగు అయిన మహిళ ఆరోగ్యంగా ఉండాలి. వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారు చేపట్టిన ఏ రంగమైనా అభివృద్ధి పథంలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో మహిళలు, యువతులు, బాలికలు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో వారి ఆరోగ్య రక్షణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్త్ నారీ సశక్త్, పరివార్ అభియాన్ (ఆరోగ్యవంతమైన మహిళ – శక్తివంతమైన కుటుంబం) కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
ఆరోగ్య పరీక్షలు.. అవగాహన
సాధారణంగా మహిళలు ఆరోగ్య సమస్యలపై ఇబ్బందులు పడుతుంటారు. అధిక రక్తపోటు, మధుమేహం, చర్మవ్యాధులు, చెవి, ముక్కు, గొంతు, దంత, రక్తహీనత, సీ్త్ర వ్యాధి సమస్యలు, క్యాన్సర్, కిశోరబాలికలు కౌమరదశలో వచ్చే సమస్యలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో గైనకాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ ఫిజీషియన్, దంత, సంబంధిత తదితర ప్రత్యేక వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్న మహిళలకు వైద్య సేవలను అందిస్తారు. పోషకాహార ఆవశ్యకతను వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌన్సెలింగ్ ఇస్తారు. పిల్లలు, గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. క్షయ వ్యాధి పరీక్షలు, క్షయ వ్యాధి రోగులకు సహకరించేందుకు నిక్షయ్ మిత్ర, సికిల్ సెల్ పరీక్షలతో పాటు కార్డులను అందజేస్తారు. గతంలో నమోదు కాని వారికి ఏబీహెచ్ కార్డు, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తారు. 10 శాతం చక్కెర, వంట నూనెలు తగ్గింపుతో ఊబకాయానికి చెక్ పెట్టడం వంటి అంశాలను వైద్యులు తెలియజేస్తారు.