
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
పోలీస్ గ్రీవెన్స్‌కు 16 అర్జీలు
పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 16 అర్జీలు అందాయి. ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా ఫిర్యాదులు అందాయన్నారు.
గద్వాల/గద్వాల క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుకు ప్రాధాన్యతినిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదుదారుల నుంచి 41 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ తెలిపారు. వాటిని ఆయా శాఖలకు పంపి పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. పరిష్కారం కాని యెడల అందుకు సంబంధించి కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారునికి అక్‌నాలెడ్జ్‌మెంట్ పంపాలని చెప్పారు.
న్యాయం చేయరూ..
ఇజ్రాయిల్ దేశంలో తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ధరూరు మండల కేంద్రం పాస్టర్ అబ్రహాం అలియాస్ సుదర్శన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు చిట్టిబాబు మరో తొమ్మిదిమంది కోరారు. ఈమేరకు వారు సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సందర్బంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇజ్రాయిల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి.చిట్టిబాబు రూ.5.50లక్షలు, బి.రత్నకుమార్ రూ.7లక్షలు, కె.బేబికిషోర్ రూ.7.50లక్షలు, జె.భారతి రూ.7.50లక్షలు, కె.ప్రభుదాసు రూ.7.50లక్షలు, మేరీ రూ.2.50లక్షలు, ప్రసాద్ రూ.7.50లక్షలు, సునిల్ రూ.7.50లక్షలు, సూజాత రూ.7.50లక్షలు, మేరికుమారి రూ.7.50లక్షలను పాస్టర్ అబ్రహాం అలియాస్ సుదర్శన్ తమతో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు మీడియా ముందు వాపోయారు. తీసుకున్న డబ్బులు ఇస్తానని చెప్పి అందుకు సంబంధించి చెక్కులు ఇచ్చినట్లు, అయితే ఆ చెక్కులు బ్యాంకులో డ్రా చేసుకోవటానికి వెళితే అకౌంట్‌లో డబ్బులు లేకపోవడంతో వెనుదిరిగినట్లు తెలిపారు. దీనిపై పాస్టర్ అబ్రహాం అలియాస్ సుదర్శన్‌ను అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. తీసుకున్న డబ్బును తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరారు.