
శరన్నవరాత్రి వైభవం
● శైలపుత్రి, పార్వతీదేవిగా జోగుళాంబ, జములమ్మ అమ్మవార్ల దర్శనం
● కనులపండువగా ఉత్సవాలు ప్రారంభం
● ఆలయాల్లో మహిళల ప్రత్యేక పూజలు
గద్వాలటౌన్/ఎర్రవల్లి: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం జిల్లా వ్యాప్తంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిచ్చారు. జోగుళాంబ అమ్మవారు శైలపుత్రిగా.. నడిగడ్డ ఇలవేల్పు జమ్ములమ్మ అమ్మవారు పార్వతీదేవిగా.. బీచుపల్లిలోని దుర్గామాత బాలాత్రిపుర సుందరీదేవిగా.. గద్వాల కన్యకాపరమేశ్వరి అమ్మవారు వారాహిదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం ధ్వజారోహణతో కార్యక్రమాలు వైభవంగా చేపట్టారు. మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. గద్వాల కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారిని పూల పల్లకిపై ఊరేగించారు. ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో కాళికాదేవి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు.
● బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయంలో దుర్గామాత బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో, కోదండరామస్వామి ఆలయంలో జ్ఞాన సరస్వతీదేవి ఆదిలక్ష్మీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మొదటిరోజు అర్చకులు సుప్రభాతసేవ, క్షీరామృతాభిషేకం, ఆరాధన, కుంకుమార్చన వంటి పూజలను నిర్వహించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. అలాగే, శివాలయంలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు.