
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
గద్వాల వ్యవసాయం: రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, ప్రకృతికి అనుగుణంగా పంటలు పండించడం ద్వార దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చునని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. సోమవారం గద్వాలలోని బ్రహ్మకుమారీస్ అమృత కుంజు భవనంలో ప్రపంచ సేంద్రియ వ్యవసాయ సాగు దినోత్సవాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం వల్ల నేల, నీరు, పర్యావరణం కలుషితమవుతాయన్నారు. రసాయనిక మందుల వాడకం తగ్గించడం వల్ల జీవ వైవిధ్యాన్ని పెంచవచ్చునన్నారు. సేంద్రియ పద్ధతుల్లో పండిన ఆహారంలో పోషక విలువలు అధికంగా ఉంటాయన్నారు. వ్యవసాయంలో పాడి పంటలను కలిపి నిర్వహించడం ద్వార ఆరోగ్యకరమైన పంటలను పండించవచ్చునని చెప్పారు. రైతులు దేశీయ ఆవులను పెంచాలని సూచించారు. వీటి పాలద్వార చేసే ఉత్పత్తులు మానవాళి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. వర్మీ కంపోస్ట్ సులభంగా తయారు చేసుకోవచ్చునని వివరాలు ఆయన తెలియజేశారు. పంటల మార్పిడి విధానాలు పాటించాలని సూచించారు.
సేంద్రియ పద్ధతిలో సాగు మేలు
కూరగాయలు, మిల్లెట్స్, పంటలు సేంద్రియ పద్ధతుల్లో పండించే విధంగా రైతులు సిద్ధం కావాలన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ స్పూర్తిగా నిలిచిన పలువరు రైతులను ఆయన ఈసందర్భంగా సన్మానించారు. వనపర్తి జడ్పీ మాజీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, ప్రకృతి వ్యవసాయ నిపుణులు రాజవర్ధన్, జ్ఞానేశ్వర్‌రెడ్డి, నాగరాజు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ అయ్యపురెడ్డి, బ్రహ్మకుమారీస్ సంస్థ వ్యవసాయ సాగు వ్యవస్థ తెలంగాణ ఇంచార్జి అరుంధతి, జిల్లా ఇంచార్జి మంజుల, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.