ఏ క్షణమైనా కూలొచ్చు..! | - | Sakshi
Sakshi News home page

ఏ క్షణమైనా కూలొచ్చు..!

Sep 22 2025 10:01 AM | Updated on Sep 22 2025 10:01 AM

ఏ క్ష

ఏ క్షణమైనా కూలొచ్చు..!

ఆందోళన కలిగిస్తున్న శిథిల భవనాలు

నోటీసులతో సరిపెడుతున్న అధికారులు

అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ

గద్వాలటౌన్‌: 2010 జూన్‌ 12 నాడు.. గద్వాల కూరగాయల మార్కెట్‌లో శిథిలమైన ఓ సముదాయం పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో పది మంది అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరికొంత మంది గాయపడ్డారు.

● 2021 అక్టోబరు 09 నాడు.. అయిజ మండలం కొత్తపల్లి గ్రామంలో నివాస గుడిసె గోడ పేకమేడలా కూలి పెనువిషాదాన్ని నింపింది. ఇంట్లో నిద్రస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృత్యుఒడిలోకి చేరారు.

● 2024 ఆగస్టు 21 నాడు.. అయిజ మున్సిపాలిటీ పరిఽధిలోని కోత్తపేట కాలనీలో నివాస గుడిసె గోడ కూలీ ఎనిమిదేళ్ల చిన్నారి శ్రీకృతి మృతి చెందింది. మరో చిన్నారి గాయపడింది..

ఈ సంఘటనలను చూస్తే... చేతులు కాలేదాకా కళ్లు తెరుచుకోరు.. కాళ్లు కదలవు అన్నట్లుగా ఉంది ఆయా శాఖల అధికారుల పనితీరు. శిథిలమైన భవనాలు, ఇళ్లు అధికారుల ఎదుట కనిపిస్తున్నా అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో సంబంధిత అధికారులు స్థానికంగా ఉన్న శిథిల భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. ప్రతి ఏడాది ఎక్కడో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా.. విలువైన ప్రాణాలు గాల్లో కలసిపోతున్నా.. పురాతన భవనాలు, కట్టడాల విషయంలో అధికారులకు, పాలకులకు చీమ కుట్టినట్లు కూడా అనిపించటంలేదు. శిథిల భవనాల్లో నివసించడం, వ్యాపారాలు చేయడం భయంగా మారిందని పలువురు వాపోతున్నారు. ఈ స్థితిలో గద్వాలలో పురాతన కట్టడాలు, నివాస గృహాలు, భవనాల భద్రత, నాణ్యత ఎంతమాత్రం అన్న ప్రశ్న రేకెత్తించింది. గత నెల రోజలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

గుర్తించినా.. పట్టించుకోవటం లేదు

వానాకాలం ముందు జిల్లాలో పాత భవనాల ఇళ్లను గుర్తించేందుకు అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. పట్టణాలు, గ్రామాల్లో అప్రమత్తం చేసినా ఇంటి యజమానుల్లో అవగాహన కలగటం లేదు. కొంతమంది ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. కానీ కొందరు ఇళ్ల యజమానులు మాత్రం తమకేమి పట్టనట్లు ఉండిపోయారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే 44 మందికి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గత నెల రోజలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భయం గుప్పిట్లో 60 కుటుంబాలు

జిల్లాకే గర్వకారణంగా నిలిచిన మట్టికోట బురుజులు ప్రమాదకరంగా మారాయి. కోట బురుజుల అంచున ప్రమాదం పొంచి ఉంది. ఏ క్షణాన్నైనా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో శిథిలావస్థలో ఉన్న కోట బురుజులు ఎప్పుడు కూలుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మట్టి కోట బురుజుల అంచున ఉన్న స్థానిక జివిలి వీధిలో సుమారు 60 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. వారందరూ నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవించే పరిస్థితి నెలకొంది. అదృష్టవ శాత్తు ఇప్పటి వరకు ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలోనే మట్టి కోట బురుజులు కూలలేదు. మిగిలిన అన్ని చోట్ల మట్టి కోట బురుజులు కూలిపోయాయి. విధి వక్రీకరిస్తే మాత్రం.. చాలా ఇళ్లు నేలమట్టమయ్యే అవకాశముంది. అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసి సమాధి అయ్యే ప్రమాదం ఉంది. అధికారులు జివిలి వీధి వాసులకు నోటీసులు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయించడం.. రెండు రోజుల అయిన వెంటనే మళ్లి వచ్చి ఇళ్లలో చేరడం పరిపాటిగా మారింది.

పొంచి ఉన్న ముప్పు...

స్థానిక కృష్ణవేణి చౌరస్తా దగ్గర ఉన్న పీఏసీఎస్‌ గోదాం కూలడానికి సిద్ధంగా ఉంది. ఏ మాత్రం పెద్దగాలి వీచిన కుప్పుకూలిపోతుంది. గోదాం షెడ్డుకు ఉన్న దిమ్మెలు శిథిలమై నామమాత్రంగా నిలబడి ఉన్నాయి. ఈ గోదాంలో ఎరువులను ఉంచుతారు.

మున్సిపాలిటీకి చెందిన చాలా దుకాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ముఖ్యంగా డీ, ఈ– బ్లాక్‌లలోని సుమారు 30 దుకాణాలు దెబ్బతిన్నాయి. దుకాణాల పైకప్పులు పెచ్చులుడినాయి. ఆ దుకాణాలలో కొంత మంది కారం కొట్టే యంత్రాలు నిర్వహిస్తున్నారు. యంత్రాల శబ్దానికి దుకాణాల గోడలు అదురుతున్నాయని ఇతర వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీ జారీ చేసిన నోటీసులు రాజకీయ జోక్యంతో అవి బుట్టదాఖలయ్యాయి.

పట్టణంలోని జానకమ్మ సత్రం, బాణాల వెంగన్న దుకాణా సముదాయలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ దుకాణాలు దేవాదాయశాఖ పరిధిలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా సార్లు సిమెంట్‌ పెచ్చులూడిపడటం, ఇనుప ఊచలు బయటకు వేలాడుతూ భయం కలిగిస్తున్నాయని అందులోని వ్యాపారులు చెబుతున్నారు.

ఎంపీడీఓ కార్యాలయంతో పాటు దాని వెనకభాగంలో ఉన్న ప్రభుత్వ క్వార్టర్లు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. పోలీస్‌ క్వార్టర్స్‌లోని కొన్ని బ్లాక్‌లు సైతం దెబ్బతిన్నాయి. కొత్త కలెక్టరేట్‌ ప్రారంభంతో ఇవన్నీ ఖాళీ అయ్యాయి. అయినప్పటికి శిథిల భవనాలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీటితో పాటు పలు శాఖల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి.

అప్రమత్తం చేస్తాం

పట్టణాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలను ఇప్పటికే గుర్తించడం జరిగింది. కోట బురుజుల అంచున నివాసం ఉంటున్న జివిలీ వీధివాసులకు గతంలోనే నోటీసులు జారీ చేయడం జరిగింది. శిథిలావస్థ ఇళ్లులో నివాసం ఉంటున్న వారిని గుర్తించి అప్రమత్తం చేశాం. మరోసారి చర్యలు చేపడతాం. – జానకీరామ్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, గద్వాల

ఏ క్షణమైనా కూలొచ్చు..! 1
1/3

ఏ క్షణమైనా కూలొచ్చు..!

ఏ క్షణమైనా కూలొచ్చు..! 2
2/3

ఏ క్షణమైనా కూలొచ్చు..!

ఏ క్షణమైనా కూలొచ్చు..! 3
3/3

ఏ క్షణమైనా కూలొచ్చు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement