
జోగుళాంబ క్షేత్రంలో భక్తుల సందడి
● మహాలయ అమావాస్యతో ప్రత్యేక పూజలు
● చండీహోమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న వైనం
అలంపూర్: దసరా సెలవులు ప్రారంభం కావడం.. అందులోనూ మహాలయ అమావాస్య రావడంతో జోగుళాంబ క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. ఆదివారం క్షేత్రంలోని అన్ని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి వారిని దర్శించుకొని అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు పలికారు.
భక్తిశ్రద్ధలతో చండీహోమాలు..
అమావాస్య కావడంతో జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో చండీ హోమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రాకపోకలు కొనసాగగా.. క్యూలైన్‌లలో బారులు తీరారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. భక్తుల రాకతో ప్రధాన రహదారి రద్దీగా మారింది. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా పోలీసులు తగు చర్యలు చేపట్టారు.
గద్వాల ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుటుంబసమేతంగా జోగుళాంబ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలబ్రహ్మేశ్వర స్వామి జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. అర్చకస్వాములు వారికి తీర్ధ ప్రసాదాలు అందజేసి అశీర్వచనం పలికారు.

జోగుళాంబ క్షేత్రంలో భక్తుల సందడి

జోగుళాంబ క్షేత్రంలో భక్తుల సందడి