
కేసులు త్వరగా పరిష్కరించాలి
గద్వాల క్రైం: పెండింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి ఎన్‌వీ. శ్రావణ్ కుమార్ అన్నారు. జిల్లా కోర్టును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ఎన్ ప్రేమలతతో కోర్టుకు సంబంధించిన పలు సమస్యాత్మక కేసులను అడిగి తెలుసుకున్నారు. నూతన కోర్టు సమూదాయం పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని, ప్రస్తుతం స్థల సేకరణ, నిర్మాణ పనుల విషయంలో న్యాయవాదులు పలు సూచనలు, అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు ఆయన దృష్టికి జిల్లా జడ్జి తీసుకెళ్లారు. ప్రభుత్వం వ్యవసాయ సాగుకు అసవరమయ్యే జలవనురుల కోసం, ప్రాజెక్టు నిర్మాణాల కోసం స్థల సేకరణ పూర్తి చేసిన క్రమంలో రైతులకు అందించే ఆర్థిక సహాయ విషయంలో పలు అడ్డంకులు, రైతుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. వివిధ సమస్యలపై న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలో సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని న్యాయమూర్తి తెలిపారు. సిబ్బంది జీపీఎఫ్, పదవీరమణ, మెడికల్ బిల్లులు తదితర పెండింగ్ బిల్లుల మంజూరు అంశాలపై న్యాయమూర్తికి సిబ్బంది తెలియజేశారు. అంతకుముందు హైకోర్టు న్యాయమూర్తికి పలువురు న్యాయమూర్తులు శాలువా, పూలబోకేతో సత్కరించారు.