
అట్టహాసంగా బోధనోపకరణ మేళా
గద్వాలటౌన్: సాధారణంగా మేళా అనగానే విద్యార్థులు పాల్గొని తమ ప్రాజెక్టుల గురించి ఆహుతులకు, తోటి విద్యార్థులకు వివరించడం చూస్తుంటాం. అందుకు భిన్నంగా తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లాస్థాయి బోధనాభ్యాసన సామగ్రి (టీఎల్‌ఎం) మేళా పోటీలను నిర్వహించారు. స్థానిక బాలభవన్‌లో జిల్లాస్థాయి టీఎల్‌ఎం వేళాను నిర్వహించారు. జిల్లాలోని 13 మండలాలకు చెందిన సుమారు 120 మంది ఉపాధ్యాయులు వేళాలో పాల్గొని తాము తయారు చేసిన బోధనపకరణాలను ప్రదర్శించారు. తెలుగు, ఆంగ్లం, ఈవీఎస్, గణితానికి సంబంధించిన నమూనాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. వాటిని విద్యార్థుల్లా అందరికి వివరించి ఔరా అనిపించారు. డీఈఓ అబ్దుల్ ఘనీ మేళాను ప్రారంభించి ఆయా ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు.
రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలి
బోధనోపకరణ ప్రదర్శనలో రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా ఉపాధ్యాయులు తమ సత్తాచాటి బోధనలో తమకు సాటిలేరని నిరూపించాలని డీఈఓ అబ్దుల్ ఘనీ ఆకాక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక స్థాయి విద్యార్థికి చదవడం, రాయడం వంటివి వచ్చి ఉండాలని, అందుకు ఉపాధ్యాయులు శ్రమించాల్సిన అవసరముందన్నారు. బోధనాభ్యసన సామగ్రి విద్యార్థిలో ఆసక్తిని పెంపొందించడంతో పాటు సులువుగా నేర్చుకోవడానికి దోహ దపడుతుందని వివరించారు. టీఎల్‌ఎం వేళాకు న్యాయ నిర్ణేతలుగా జీహెచ్‌ఎంలు మహేష్, అమీర్‌భాషా, బాలాజీ, విష్ణువర్థన్ వ్యవహరించారు.
విజేతలు వీరే..
ప్రతి విభాగంలో ఇద్దరి చొప్పున 8 మంది ఉపాధ్యాయులను రాష్ట్రస్థాయి టీఎల్‌ఎం మేళాకు ఎంపిక చేశారు. లక్ష్మి (కొండపల్లి), రమీజాభీ (పెద్దపోతులపాడు), పరమేశ్వరి (అయిజ), మోహిని (తక్కశిల), శ్రీలత (తాటికుంట), నాగరాజు (పెదొడ్డి), కిశోర్‌కుమార్ (నాగర్‌దొడ్డి), శిశిరేఖ (మాచర్ల) విజేతులుగా నిలిచారు.

అట్టహాసంగా బోధనోపకరణ మేళా