
బడుల నిర్వహణకు కష్టాలు
కాటారం: సర్కారు బడుల నిర్వహణకు నిధుల కొర త నెలకొంది. పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ పాఠశాలల ఖాతాల్లో డబ్బులు జమకాకపోవడంతో నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాఠశాలల్లో అవసరమయ్యే చాక్‌పీస్‌లు, స్టేషనరీ సామగ్రి, చిన్న, చిన్న మరమ్మతుల కోసం ప్రధానోపాధ్యాయులు తమ జేబులో నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలలకు మాత్రం 50 శాతం నిధులు మంజూరయ్యాయి. మిగితా పాఠశాలల్లో నిధుల లేమి నెలకొనడంతో నిర్వహణ భారంగా మారిపోయింది. ఏటా రెండు పర్యాయాలు నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం ఇప్పటివరకు నిధులు అందించలేదు. ఇటీవల ప్రభుత్వం పాఠశాల గ్రాంట్స్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు పాఠశాలల ఖాతాల్లో జమకాలేదు.
జిల్లాలో 430 పాఠశాలలు..
జిల్లాలో 317 ప్రాథమిక, 44 ప్రాథమికోన్నత, 69 ఉన్నత పాఠశాలలో కలుపుకొని 430 పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో 19,788 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలలకు నిర్వహణ నిధులు మంజూరవుతాయి. గతేడాది సకాలంలో నిధులు మంజూరైనప్పటికీ ఈ ఏడాది మాత్రం నిధులు జమకావడంతో జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో పాఠశాలల్లో తాగునీరు, విద్యార్థుల పరీక్షల నిర్వహణ, జాతీయ పండుగలు, గదుల మరమ్మతు, ప్రయోగశాల సామగ్రి కొనుగోలు, తదితర నిర్వహణ హెచ్‌ఎంలకు కష్టతరంగా మారింది.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా..
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. 1నుంచి 30మంది వరకు విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలకు రూ.10వేలు, 31నుంచి 100లోపు పాఠశాలలకు రూ.25వేలు, 101 నుంచి 250మంది వరకు రూ.50వేలు, 251 నుంచి 1000 వరకు విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలకు రూ.75వేల చొప్పున ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. విద్యార్థుల సంఖ్య వెయ్యి దాటితే ఆ పాఠశాలలకు రూ.లక్ష వరకు నిధులు వస్తాయి.
క్రీడలపై నిర్లక్ష్యం..
ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లించే నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతుండటంతో క్రీడలపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో పాఠశాలల్లో క్రీడా సామగ్రి కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పాఠశాలల్లో పాత క్రీడా సామగ్రితో కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.
నిధులు జమ చేస్తున్నాం..
ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన నిర్వహణ నిధులు విడుదల అయ్యాయి. పాఠశాలల ఖాతాల్లో జమ చేస్తున్నాం. త్వరలోనే అన్ని పాఠశాలలకు నిధులు చేరుతాయి. పాఠశాలల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం.
– రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి
ఆర్థిక కష్టాల్లో సర్కారు స్కూళ్లు
నాలుగు నెలలుగా అందని నిధులు
ఇబ్బందులు పడుతున్న హెచ్‌ఎంలు

బడుల నిర్వహణకు కష్టాలు

బడుల నిర్వహణకు కష్టాలు

బడుల నిర్వహణకు కష్టాలు