
పూల పరిమళం
ఘనంగా సద్దుల బతుకమ్మ
భూపాలపల్లి అర్బన్: ‘ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయే చందమామ’ అంటూ తీరొక్క పూలతో తెలంగాణ పల్లె వాకిట్ల సాగిన బతుకమ్మ సంబురాలు సోమవారం జిల్లావ్యాప్తంగా జరిగిన సద్దుల బతుకమ్మతో ముగిశాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు వైభవంగా కొనసాగింది. సోమవారం జిల్లావ్యాప్తంగా మహిళలు, యువతులు, విద్యార్ధినులు ఉదయం నుంచే పూల సేకరణలో నిమగ్నమయ్యారు. అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మహిళలు, యువతులు, చిన్నారులు అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలతో ఆయా ప్రాంతాలకు తరలివెళ్లారు. అక్కడ బతుకమ్మలను ఉంచి ‘రామ రామ రామ ఉయ్యాలో..’ అంటూ పాటలు పాడారు. ఆటలు ఆడారు. కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు. కష్టాలు తొలగిపోవాలంటూ గౌరమ్మను వేడుకున్నారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని జనవనరుల్లో బతుకమ్మను జారవిడిచి ‘పోయిరా గౌరమ్మ.. పోయి రావమ్మా..’ అని ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం వాయినాలు ఇచ్చుకున్నారు.
పట్టణంలో ఘనంగా..
భూపాలపల్లి పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పాత కూరగాయాల అంగడి మైదానాలు, హనుమాన్ దేవాలయం, సంతోషిమాత, రామాలయం, అయ్యప్ప ఆలయాల వద్ద బతుకమ్మ వేడుకులకు మహిళలు, యువతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పలు బతుకమ్మ ఆట స్థలాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సందర్శించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ప్రాంగణాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ పరిఽధిలోని మహిళలు బతుకమ్మ పండుగను ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ ఆడిన అనంతరం పట్టణ శివారులోని పాత ఎర్ర చెరువులో నిమజ్జనం చేశారు.
ఊరూవాడ వేడుక
ఉట్టిపడిన
సంస్కృతి, సంప్రదాయం
గౌరీ దేవికి ఘనంగా వీడ్కోలు
వాయినాలు ఇచ్చుకున్న మహిళలు
ముగిసిన పూలపండుగ

పూల పరిమళం