రుణాల కోసం యువత ఎదురుచూపులు
తేలని సిబిల్ స్కోర్ సమస్య
స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం
జిల్లావ్యాప్తంగా 29 వేల దరఖాస్తులు
ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని యువత ఆవేదన
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువవికాసం దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. నెల రోజుల్లో రుణాలు ఇస్తామని దరఖాస్తులు స్వీకరించి, మండలస్థాయిలో కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి 29,367 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వివిధ యూనిట్లకు వేల సంఖ్యలో దరఖాస్తులు రాగా.. అధిక విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పొందవచ్చన్న ఉద్దేశంతో ఎక్కువ మంది కేటగిరీ–4 రుణాలకే మొగ్గుచూపారు.
ఆర్బీఐ నిబంధనలు
గతంలో పేదలకు ఆయా పథకాల కింద రుణాలు అందించేవారు. అవసరమైతే సబ్సిడీకి మించి రుణాలు తీసుకుంటే ష్యూరిటీ కింద సంతకాలు తీసుకునేవారే తప్ప పెద్దగా బ్యాంకర్లు ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మారిన ఆర్బీఐ నిబంధనల ప్రకారం సిబిల్ స్కోర్ ఉంటేనే రుణానికి అర్హత సాధిస్తారు.
ప్రభుత్వ నిర్ణయంపైనే ఆశలు
స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగులు ఆర్థిక స్వావలంబన పొందేందుకు రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రవేశపెట్టి రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే నెలలు గడుస్తున్న పథకం అమలుపై స్పష్టత కరువైంది. ప్రభుత్వం ఇచ్చే రుణాలతో కుటుంబానికి బాసటగా నిలవడంతో పాటు ఆర్థికంగా ఎదగాలనే గ్రామీణ ప్రాంత యువతకు నిరాశే నిగిలింది. స్థానిక ఎన్నికలు సమీపించడంతో యువవికాసం పథకం అమలుపై సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా సిబిల్ స్కోరును మినహాయిస్తేనే గ్రామీణ ప్రాంతంలోని ఎక్కువ మంది నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
కేటగిరీ దరఖాస్తులు యూనిట్లు
ఎస్సీ 8,779 3,500
ఎస్టీ 3,787 1,809
బీసీ 15,425 2,714
ఈబీసీ 447 511
ముస్లింలు 981 186
క్రిస్టియన్లు 48 57
షరతులు లేకుండా అందించాలి
గ్రామాల్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేక యువత ఇబ్బందులు పడుతోంది. ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రుణాలు మంజూరు చేయాలి. ప్రభుత్వం నిబంధనలు సడలించి వీలైనంత తొందరగా రుణాలు అందించాలి.
–శానబోయిన మహిపాల్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు
యువతను ఆదుకోవాలి
రాజీవ్ యువవికాసం పథకం రుణాలను త్వరితగతిన అందించి యువతను ఆదుకోవాలి. అటు ఉపాధి లేక కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలి. సిబిల్ స్కోర్, పాన్‌కార్డుతో సంబంధం లేకుండా ఇవ్వాలి. అర్హులైన అందరికీ అందించాలి.
–యాసారపు కర్నాకర్, చౌడారం గ్రామం