
దంచి కొట్టిన వాన
జనగామ: రైతులు కష్టపడి పండించిన పంటను ఆదివారం అకస్మాత్తుగా కురిసిన వర్షం ఆగం చేసింది. వానాకాలం సీజన్ కోతలు మొదలవుతున్న నేపథ్యంలో పంట సరుకులను అమ్ముకునేందుకు రైతులు మార్కెట్ బాటపడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులకు నష్టం తప్పడంలేదు. జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వేల క్వింటాళ్ల ధాన్యం, మక్క గింజలు ఆదివారం అరగంటపాటు కురిసిన భారీ వర్షంతో తడిసి ముద్దయ్యాయి.
వరదకు కొట్టుకుపోయిన గింజలు
జిల్లాలో వానాకాలం సీజన్ కోతలు మొదలయ్యా యి. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చే యకపోవడంతో, జిల్లా నలుమూలల నుంచి పంట ను విక్రయించేందుకు రైతులు జనగామ వ్యవసా య మార్కెట్‌కు వస్తున్నారు. మక్కలు, ధాన్యంలో తేమ అధికంగా ఉండడంతో రోజుల తరబడి సరుకులను కాటన్ యార్డులో ఆరబోసుకుంటున్నారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదతో కాటన్ యార్డులో ఆరబోసిన ధాన్యం, మక్కలు నీటిలో కొట్టుకుపోయాయి. గింజలను ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకుండాపోయింది. దీంతో 15 బస్తాల వరకు మక్కలు, 18 బస్తాలకు పైగా ధాన్యం కొట్టుకుపోవడంతో రెక్కల కష్టం వరద పాలైందని రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ఎండ లేకపోవడంతో తడిసిన ధాన్యం గింజలు మొలకెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏటా ఇదే తంతు
మార్కెట్ కాటన్ యార్డులో చుట్టుపక్కల డ్రెయినేజీ సిస్టం, ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయకపోవడంతో వర్షం కురిసిన ప్రతీసారి రైతులకు నష్టం తప్పడంలేదు. అధికారులు మాత్రం ఇదేమీ పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాటన్ యార్డులో డ్రెయినేజీ వ్యవస్థను నిర్మించి సీజన్‌కు 20 రోజుల ముందుగానే అవసరమైన టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.
పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండలంలో ఆదివారం భారీవర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగిపోర్లాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో 35.4 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలపాలైంది. మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన మక్కలు తడవడంతో రైతులు వాపోతున్నారు. ఆరపోసిన మక్కలు వరదలో కొట్టుకుపోయాయి.