
సర్దుబాటులో జాప్యమెందుకు?
జనగామ: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో జాప్యంతో విద్యార్థుల భవిష్యత్‌పై నీలి నీడలు అలుముకుంటున్నాయి. డీఈఓగా ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టినా విద్యాశాఖ పనితీరు మెరుగుపడడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు గత నెల 4వ తేదీన సర్ధుబాటు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, ఆలస్యానికి గల కారణాలు తెలియడం లేదు.
‘సాక్షి’ కథపనాలతో వెనక్కి తగ్గిన విద్యాశాఖ
జిల్లాలో జూలై మాసంలో మొదటిసారి టీచర్ల సర్దు బాటు చేపట్టారు. 109 మంది ఉపాధ్యాయులను సర్దుబాటుచేయగా, దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. సర్దుబాటులో పైరవీలు, అవకతవకలపై సాక్షి దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది. స్పందించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా సర్దుబాటుకు తాత్కాలిక బ్రేక్ వేశారు. ఇదే సయయంలో ఆగస్టు 2, 3 వారాల్లో ఎస్జీలు, ఎస్‌ఏలకు పదోన్నతుల ప్రక్రియను మొదలు పెట్టారు. ప్రమోషన్ల ఖాళీల ఆధారంగా మరోసారి సర్దుబాటు చేయాలని, ఇందుకు సంబంధించి సెప్టెంబరు 4 వరకు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 87 మంది ఎస్జీలు, 19 మంది ఎస్‌ఏలకు పదోన్నతులు రాగా, టీచర్లు ఖాళీ అయిన బడులకు సర్దుబాటు ద్వారా భర్తీ చేయాలి. రెండోసారి చేపట్టిన సర్ధుబాటులో పైరవీలకు ఆస్కారం లేకుండా ఉండాలనే జాగ్రత్త పేద విద్యార్థుల భవిష్యత్‌ను ఆగం చేస్తుంది. రఘునాథపల్లి మండలం నక్కబొక్కల తండా, పాలకుర్తి మండలం కిష్టాపూర్(సింగిల్ టీచర్), బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు పదోన్నతులపై వెళ్లిపోయారు. దీంతో బడిలో పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఈ విషయంపై సాక్షి కథనం ప్రచురించగా.. రఘునాథపల్లి, పాలకుర్తి ఎంఈఓలు స్పందించి తాత్కాలికంగా ఆ బడులకు టీచర్లను పంపించారు. బచ్చన్నపేట ఎంఈఓ మాత్రం సీఆర్‌పీతో నెట్టుకొస్తూ, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సర్దుబాటు ముసాయిదా
ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి ఎలాంటి అధికారి సంతకాలు, రాజముద్ర లేకుండా ముసాయిదా (డ్రాఫ్ట్) పేరిట ఇటీవల ఓ సర్క్యులర్ బయటకు రాగా, టీచర్ల వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో 94 మంది టీచర్లకు సంబంధించి సర్దుబాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 84 మందిని సొంత మండలంలోనే సర్దుబాటు చేయగా, ఆరుగురిని పక్క మండలాలకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది నిజమా..? లేక ఇందులో ఏమైనా తప్పులు ఉంటే సరి దిద్దుకునేందుకు లీక్ ఇచ్చారా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆరోపణలు వచ్చిన స్కూల్స్‌కు సంబంధించి సాక్షి కథనాలతో వాటి జోలికి వెళ్లలేదని ముసాయిదా జాబితాతో తెలుస్తుంది.
టీచర్లు వస్తారా.. టీసీలు ఇస్తారా..?
టీచర్లకు పదోన్నతులు కల్పించి నెలరోజులు గడిచిపోతున్నా సర్దుబాటు ప్రక్రియ జాప్యంపై తల్లిందండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు టీచర్లకు పదోన్నతి వచ్చింది. దీంతో ఇద్దరూ వెళ్లిపోవడంతో సీఆర్‌పీతో నెట్టుకొస్తున్నారు. మండలంలో ఇతర పాఠశాల నుంచి తాత్కాలికంగా టీచర్లను సర్దుబాటు చేయాల్సి ఉండగా, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టీచర్లను నియమించాలని తల్లిదండ్రులు పలుమార్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులు జంపయ్య, కరుణాకర్, మాధవి, ప్రతాపరెడ్డి, సత్తెమ్మ, కిష్టయ కల్యాణి, భవ్య, ఐలయ్య మాట్లాడుతూ.. ఇద్దరు ఉపాధ్యాయులు పదోన్నతిపై వెళ్తే వారి స్థానంలో మరొకరిని నియమించడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని, లేని పక్షంలో టీసీలు ఇస్తే మరో పాఠశాలలో పిల్లలను చేర్పిస్తామని తల్లిదండ్రులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయమంలో విద్యాశాఖ అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి.
గడువు ముగిసి నెల రోజులు
పదోన్నతులతో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ
సీఆర్‌పీలకు బాధ్యతలు
ఎంఈఓకు పట్టని విద్యార్థుల భవిష్యత్