
శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
● పంచాయతీ రిజర్వేషన్లు
అమలవుతాయా.. రద్దవుతాయా?
● ఈనెల 8న కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
● ఖర్చు విషయంలో ఆశావహుల ఆచితూచి అడుగులు
జనగామ: దసరా పండుగ సందడితో ఊళ్లలో వెలుగులు నిండిపోగా..గ్రామ రాజకీయాల్లో మాత్రం మరోరకం ఉత్కంఠ నెలకొంది. ఎప్పటిలాగే పండగ తర్వాత పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలవుతుందని అందరూ ఊహించినా, ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈనెల 8వ తేదీన వెలువడనున్న కోర్టు తీర్పు 42 శాతం బీసీ రిజర్వేషన్ల భవిష్యత్తును నిర్ణయించనుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసి, 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే రిజర్వేషన్ల అమలు ఉండబోతుందా? లేక రద్దవుతాయా? అన్న సందేహాలపై ఆశావహ అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. రిజర్వేషన్ అనుకూలంగా ఉంటే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతారు. లేకుంటే వెనక్కి తగ్గక తప్పదనే నిర్ణయానికి ముందుగానే వచ్చేస్తున్నారు.
చర్చంతా దీనిపైనే
అభ్యర్థుల ఇళ్లలో పండగ శుభకార్యాల కంటే రాజకీయ లెక్కలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రజల్లోనూ ఉత్కంఠ తక్కువేం కాదు. ఎవరు సర్పంచ్, ఎవరు ఎంపీటీసీ, ఏవర్గం జెడ్పీటీసీని కై వసం చేసుకుంటుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం అన్ని పార్టీలు సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.
ఖర్చుకు దూరంగా నాయకులు..
ఆశావహులు తెరవెనక రాజకీయాలు నడిపిస్తూనే..రిజర్వేషన్ల ప్రకటన కోర్టు తీర్పుపై ఆధారపడి ఉండడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. డబ్బు ఖర్చు విషయంలో సైతం వెనుకంజ వేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి పండగ సందర్భాల్లో డబ్బులు ఖర్చు చేస్తూ పబ్లిసిటీ చేసుకునేవారు. అయితే అవకాశాలు, రిజర్వేషన్లు మారితే జేబులు ఖాళీ అవుతాయనే ఆలోచనతో ఖర్చుకు దూరంగా ఉన్నారు. అయితే, రిజర్వేషన్ల అమలు కొనసాగి, ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ వస్తే క్షేత్ర స్థాయిలో తమ బలాన్ని ఎలా పెంచుకోవాలనే దానిపై రెడీగా ఉన్నారు. రిజర్వేషన్లలో మార్పులు వస్తే గ్రామ రాజకీయ సమీకరణాలన్నీ తారుమారు అవుతాయని నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా బీసీ వర్గాల్లో అసంతృప్తి పెరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
రిజర్వేషన్లలో గందరగోళం
దేవురుప్పుల మండలం గొల్లపల్లిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 200 మంది ఓటర్లు ఉంటారు. ఇక్కడ 8 వార్డులు ఉండగా, సర్పంచ్ జనరల్ కేటగిరీకి ఎంపిక చేసి, ఒక్క వార్డులో కూడా ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించలేదు. నర్మెట మండలంలో సైతం వార్డుల పరిధిలో రిజర్వేషన్లు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. లింగాలఘనపురం మండలం ఏనెబావి పంచాయతీ పరిధిలో 1,2,3 వార్డుల్లో ఎస్టీలు ఉండగా, బీసీలకు రిజర్వు చేశారు. కిష్టగూడెం జీపీ 1,2 వార్డుల్లో ఎస్సీలకు రిజర్వు కాగా, ఇందులో బీసీలు, ఓసీలు మాత్రమే ఉన్నారు. 5,6వార్డుల్లో బీసీలు ఉండగా, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు. జఫర్‌గడ్ మండల కేంద్రంలో 9,10 వార్డుల్లో బీసీ ఓటర్లు ఉండగా, ఎస్సీకి రిజర్వు చేశారు. హిమ్మత్‌నగర్ పంచాయతీ పరిధిలో 1,4,10 వార్డుల్లో బీసీ ఓటర్లు ఉండగా, ఎస్సీకి రిజర్వేషన్ కలిసి వచ్చింది. తిమ్మాపూర్‌లో 4వ వార్డులో బీసీ ఓటర్లు ఉండగా ఎస్సీకి, తమ్మడపల్లి(ఐ)లో 1, 3 వార్డుల్లో బీసీ ఓటర్లు ఉండగా ఎస్సీకి, కూనూరు పంచాయతీలో 1వ వార్డులో బీసీ, ఓసీ ఓటర్లు ఉండగా, ఇక్కడ కూడా ఎస్సీకి రిజర్వుడు చేశారు. తరిగొప్పుల మండలం పోతా రం 4వ వార్డులో ఎస్సీలు ఉండగా బీసీ, 2వ వార్డులో బీసీలు ఉండగా ఎస్సీ, అక్కరాజు పల్లిలో 2, 4 వార్డుల్లో బీసీలు ఉన్నప్పటికీ ఎస్సీ, 6, 8 వార్డుల్లో ఎస్సీలు ఉండగా బీసీ, అబ్దుల్ నాగారం 8వ వార్డులో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఉండగా బీసీ, 3వ వార్డులో బీసీలు ఉండగా ఎస్సీ, సోలీపూర్‌లో 1, 7 వార్డుల పరిధిలో బీసీలు ఉండగా ఎస్సీ, 9, 10 వార్డుల్లో ఎస్సీలు ఉండగా బీసీ రిజర్వేషన్ కల్పించారు.
పోషకాహారంతో ఆరోగ్యం
ఇవేం రిజర్వేషన్లు
తరిగొప్పుల మండల పరిధిలో ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళా రిజర్వేషన్ కాగా, 6 ఎంపీటీసీల్లో ఒక్క ఎంపీటీసీ స్థానానికి ఎస్టీ మహిళ రిజర్వు కాలేదు. మండలంలోని అంకుషాపూర్ ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌గా కేటాయించారు. దీంతో ఇవేక్కడి రిజర్వేషన్లు అంటూ జనాలు ముక్కున వేలుసుకుంటున్నారు.

శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్ శ్రీ 2025