
అంగరంగ వైభవంగా..
● జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలు
● బతుకమ్మకుంటలో ఘనంగా రావణవధ
● వేలాదిగా తరలివచ్చిన ప్రజలు
● చెడుపై విజయమే దసరా: ఎమ్మెల్యే పల్లా
జనగామ: జిల్లావ్యాప్తంగా ప్రజలు దసరా పండగను ఘనంగా జరుపుకున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతాల్లో ఆలయాలతో పాటు ఊరికి శివారులో ఉన్న జమ్మిచెట్టు వద్దకు వెళ్లారు. శ్రీశమీ శమియతే పాపం, శమీ శత్రు వినాశనం, అర్జునస్య ధనుద్ధారి, రామస్య ప్రియదర్శనంశ్రీ అంటూ జమ్మిచెట్టు వద్ద పూజలు చేశారు. ఒకరికొకరు జమ్మి ఇచ్చిపుచ్చుకుని, అలైబలై చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాత్రి 7 గంటలకు బతుకమ్మకుంటలో జరిగిన రావణవధ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బతుకమ్మకుంటకట్టపై భారీ పది తలల రావణాసురుడి కటౌట్ ఏర్పాటు చేశారు. అంతకుముందు దుర్గామాత ఆలయంలో ఎమ్మెల్యే పల్లా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జమ్మి చెట్టువద్దకు వెళ్లారు.
బతుకమ్మకుంటలో రావణవధ..
బతుకమ్మకుంటలో రావణవధ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో ఏఎస్సీ పండేరి చేతన్ నితిన్ పర్యవేక్షణలో సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు చర్యలు చేపట్టారు. గంటపాటు బాణాసంచా పేల్చగా, జిగేల్‌మన్న స్టార్స్ కాంతుల్లో బతుకమ్మకుంట దేదీప్యమానంగా వెలుగొందింది. వేలాదిమంది కనులారా వీక్షిస్తుండగా, కుంటకట్టపై ఏర్పాటు చేసిన రావణాసురుడి కటౌట్‌ను పేల్చగా, ఒక్కో తల పేలిపోతున్న ఉద్విగ్న క్షణాల మధ్య జై శ్రీరామ్ నినాదాలు మారుమోగాయి. కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్, బక్క శ్రీనివాస్, నర్సింగారావు తదితరులు పాల్గొన్నారు.
మంచి ఆలోచనలు, సంప్రదాయాలు
విస్తరించాలి: వేడుకల్లో ఎమ్మెల్యే పల్లా
దసరా పండగ చెడుపై మంచిని కోరే సంకేతమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో మంచి ఆలోచనలు, సంప్రదాయాలు విస్తరించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్‌రెడ్డి, నాయకులు పోకల లింగయ్య, ముస్త్యాల దయాకర్, అనిత, పేర్ని స్వరూప, ఉల్లెంగుల సందీప్ తదితరులు ఉన్నారు.
వాడవాడలా...
పట్టణంలోని హెడ్‌పోస్టాఫీసు శ్రీ లక్ష్మిగణపతి దేవాలయం, అమ్మబావి ఉప్పలమ్మ, గుండ్లగడ్డ, పాతబీటు బజార్ శ్రీ రామలింగేశ్వర , బాణాపురం వెంటేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశ్వరస్వామి, మూలబావి శ్రీఆంజేయస్వామి, బాలాజీనగర్ ఎల్లమ్మ, శ్రీ సంతోషిమాత, గణేశ్ స్ట్రీట్ శ్రీ ఆంజనేయ, సరస్వతీ ఆలయాల్లో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవుళ్లను చల్లంగా ఉండేలా దీవించాలని కోరుకున్నారు. గీతాశ్రమంతో పాటు పాతబీటుబజారు, గీతాశ్రమం, వీవర్స కాలనీ, జనగామ మండలం పెంబర్తిలో రావణవధ కార్యక్రమం నిర్వ హించారు.

అంగరంగ వైభవంగా..

అంగరంగ వైభవంగా..

అంగరంగ వైభవంగా..