
భద్రకాళిభద్రేశ్వరుల కల్యాణోత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణోత్సవం శుక్రవారం శోభాయమానంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా ఉదయం పూజారులు నిత్నాహికం జరిపి అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు. రాత్రి శోభాయమానంగా అలంకరించిన వేదికపై జరిగిన భద్రకాళిభద్రేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వీక్షించిన వందలాది మంది భక్తులు తన్మయత్వం చెందారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం తదితర కార్యక్రమాల అనంతరం శతఘటాభిషేకం నిర్వహించారు. వివాహమహోత్సవాన్ని పురస్కరించుకుని భద్రేశ్వరస్వామికి ద్వితీయ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. అనంతరం వరపూజ, మధుపర్కవిధి, కాల్లుకడిగి కన్యాదానం చేయడం, మహాసంకల్పం మంగళాష్టకముల చూర్ణిక తదితర తంతు జరిపారు. వధూవరులకు జీలకర్రబెల్లం పె ట్టడం, మాంగల్యధారణ కార్యక్రమాలు నిర్వహించారు. కల్యాణం అనంతరం పుష్పయాగం చేశారు. ఆలయ ఈఓ సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు..
విజయ దశమితో దేవాలయంలో గురువారం శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఉదయం నిత్యాహ్నికం, కలశోద్వాసన జరిపి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం, చక్రతీర్థోత్సవం, ధ్వజారోహణం జరిపారు.

భద్రకాళిభద్రేశ్వరుల కల్యాణోత్సవం