
కొత్త సమీకరణాలు
జనగామ: జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు కావడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. శనివారం కలెక్టరేట్ సమావేశం హాల్‌లో ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓలు గోపీరామ్, డీఎస్ వెంకన్న ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో లాటరీ పద్ధతిలో పూర్తి చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడడంతో ఆశావహుల్లో సంతోషం వెల్లివిరియగా, చాన్స్ మిస్సైన వారు మాత్రం నిరుత్సాహంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా వార్డుల రిజర్వేషన్లను జిల్లాలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. లాటరీ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఊహించని పరిణామం
ఎన్నో ఏళ్లుగా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పదవులకు ఎదురుచూస్తున్న ఆశావహులకు రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో తీవ్ర నిరాశ నెలకొంది. కొన్ని చోట్ల రిజర్వేషన్లు మహిళలకు కేటాయించడంతో పురుష అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. సర్పంచ్ పదవి వస్తుందని గత రెండు, మూడేళ్లుగా గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి, రిజర్వేషన్ల రూపంలో అవకాశం కోల్పోవడంతో, కలిసొచ్చే వాటికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాలో రాజకీయ పటాన్ని మలుపు తిప్పనున్నాయి. రిజర్వేషన్లు కలిసొచ్చిన ఆశావహులు జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ బరిలో అడుగేస్తున్నారు. తమ తమ ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దల ఆశీస్సులతో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
పల్లెల్లో ఎన్నికల జోష్
స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెలు, పట్టణాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పల్లెల్లో ఎక్కడ చూసినా రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపైనే చర్చించుకుంటున్నారు. పోటీలోకి దిగబోయే నాయకులు టికెట్ కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడమే కాకుండా, కేడర్‌ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఆయా రాజకీయ పార్టీల్లో వర్గపోరు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సామాన్య ఓటర్లు కూడా రాబోయే ఎన్నికలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా..
స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ప్రాబల్యం ఉన్న గ్రామాలు, మండలాల్లో తమ బలమైన అభ్యర్థులను సిద్ధం చేస్తుండగా, బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో తన ఉనికిని బలంగా చాటుకునే ప్రయత్నంలో ఉంది. గ్రామ స్థాయిలో మంచి పేరు, పలుకుబడి ఉన్న ముఖాలను, యువతను రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి. వామపక్షాలు సైతం గతంలో సహకరించిన పార్టీలను కలుపుకుని అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వ్యూహం చేస్తున్నట్లు సమాచారం.
సవాల్ విసురుతోన్న స్వతంత్రులు
స్థానికంలో స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ అభ్యర్థులకే పోటీగా నిలిచి తమ స్థానిక ప్రభావాన్ని చూపించాలనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ప్రభావం, సామాజిక వర్గ సమీకరణాలను నమ్ముకుని గెలుపు దిశగా దూసుకెళ్లాలని స్వతంత్రులు ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన పార్టీల్లో టికెట్ రాని వారు సైతం ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు ముందస్తు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో అభ్యర్థుల ఎంపిక, కూటముల ప్రయత్నాలు, అంతర్గత అసంతృప్తులు ఎలా పరిణమిస్తాయన్నదే ఎన్నికల ఫలితాలను నిర్ణయించనుంది.
రిజర్వేషన్ల ప్రకటన రాజ్యాంగ విరుద్ధం
ఓటు బ్యాంకు కోసం 2024 సంవత్సరం కులగణన ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించ డం రాజ్యాంగ విరుద్ధం. ఈసారి ఎస్సీ, ఎస్టీలను రాజకీయంగా సమాధి చేసే ప్రయత్నం చేశారు. రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయం కోసం కొట్లాడుతాం.
– బానోతు రాంకోటి,
బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు
హీటెక్కుతున్న రాజకీయాలు
జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల రిజర్వేషన్ల అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. తాజాగా విడుదలైన రిజర్వేషన్ జాబితాలో ఊహించని మార్పులు చోటుచేసుకోవడంతో రాజకీయ నేతలు మాత్రమే కాకుండా గ్రామ స్థాయిలో ప్రజలంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లతో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ జనాభా కలిగిన జీపీల్లో జనరల్ రిజర్వేషన్ చేయడం సిగ్గుచేటన్నారు.
‘స్థానిక’ రిజర్వేషన్లపై ఊహించని మార్పులు
ఆశావహుల ఆశలను నీరు గార్చిన
రిజర్వేషన్లు
గ్రామాల్లో ఎన్నికల జోష్
పట్టుకోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్
ప్రయత్నాలు
సవాల్ విసురుతోన్న స్వతంత్రులు

కొత్త సమీకరణాలు