
జేఎస్‌జేబీలో జిల్లాకు రూ.కోటి నజరానా
జనగామ: జల సంరక్షణలో సామూహిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ అద్భుత ఫలితాలు సాధించినందుకు గాను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఎంపిక చేయగా, జనగామ జిల్లాకు రూ.కోటి నజరానా ప్రకటించింది. 2024 ఏప్రిల్ నుంచి 2025 మే వరకు నిర్వహించిన జలసంచయ్–జన భాగీదార్(జేఎస్‌జేబీ 1.0) ప్రోగ్రాంలో జల రీచార్జ్ నిర్మాణాల(సోక్‌పిట్స్, రూఫ్‌టాప్ వర్షపు నీరు సేకరణ, బోర్‌వెల్ రీచార్జ్, చెక్‌డ్యాంలు, సబ్‌సర్ఫేస్ డైక్స్, ఫార్మ్ పాండ్స్, ఫర్కోలేషన్ ట్యాంకులు)ను పూర్తి చేసి, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనివలన వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీచార్జ్ బలోపేతమైనట్లు కేంద్రం గుర్తించి, నీటి సంరక్షణ కోసం కృషి చేసిన వారికి జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చింది. జిల్లాలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు శాఖలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగస్వామ్యులు కావడంతో 12 మండలాల పరిధిలో 30,569 ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టి, జాతీయ స్థాయిలో నగదు పురస్కారానికి జనగామ ఎంపికై ంది. జిల్లా అవార్డుల్లో జనగామకు రూ.కోటి నజరానా ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంతో సాధించిన ఈ విజయాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ప్రశంసించింది. జాతీయ స్థాయిలో జనగామకు ఉత్తమ బహుమతి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అభినందించారు
కలెక్టర్ చొరవ..30,569 ఇంకుడు గుంతల నిర్మాణం
ప్రశంసలు కురిపించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ