
‘స్థానిక’ రిజర్వేషన్లపై ఉత్కంఠ
జనగామ: స్థానిక సంస్థల ఎన్నికల (ఎంపీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యులు) ప్రక్రియపై రాజకీయ వర్గాలు, ఆశావహుల దృష్టి కేంద్రీకృతమైంది. ఈసారి రిజర్వేషన్ల అంశం ప్రధాన చర్చగా మారింది. ప్రాథమిక దశ(ప్రిలిమినరీ)లో అధికార యంత్రాంగం రిజర్వేషన్ల కసరత్తును ప్రారంభించగా, అభ్యర్థులలో టెన్షన్ పట్టుకుంది. ప్రభుత్వం ఇప్పటికే 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక జీవో విడుదల కావాల్సి ఉంది. అయితే, జీవో వెలువడకపోవడంతో అధికారులు తాత్కాలికంగా సర్వేలు, గణాంకాలను సేకరించడం, గత ఎన్నికల రిజర్వేషన్ల స్థితిని పరిశీలించడం వంటి పనులను చేపట్టారు. ఒకసారి గైడ్‌లైన్‌న్స్ విడుదలైతే పూర్తిస్థాయిలో రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు సాగనుంది. ఈసారి రిజర్వేషన్లు రొ టేషన్ పద్ధతిలో అమలుకానున్నాయి. అంటే, గత ఎన్నికల్లో ఒక నిర్దిష్ట వర్గానికి కేటాయించిన స్థానాలు ఈసారి ఇతర వర్గాలకు వెళ్లే పద్ధతి రూపొందించనున్నారు. దీంతో అనేక గ్రామాలు, వార్డుల్లో పోటీ చేయాలని కలలు కంటున్న ఆశావహులు ఏ వర్గానికి రిజర్వేషన్ వస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గతంలో సాధారణంగా ఉన్న సీట్లు ఈసారి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కిందకు వచ్చే అవకాశముంది. అదే విధంగా రిజర్వ్ అయిన స్థానాలు ఈసారి సాధారణ వర్గానికి వెళ్లే పరిస్థితులు ఏర్పడవచ్చు.
రిజర్వేషన్లే కీలకం
ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మొదట రిజర్వేషన్ల జాబితా కీలక మలుపు కానుంది. ఎందుకంటే ఎవరి గ్రామంలో, ఎవరి వార్డులో పోటీ చేసే అవకాశం దీనిపైనే ఆధారపడుతుంది. స్థానిక రాజకీయ సమీకరణాలు కూడా రిజర్వేషన్ల ప్రకటనతోనే స్పష్టతకు వస్తాయి. ప్రస్తుతం కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే సమాచారంతో గ్రామాల్లో ఒక్కసారిగా ఎలక్షన్ వాతావరణం నెలకొంది. ప్రతి మండల పరిధిలో గ్రామాలు, వార్డుల జనాభా గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్‌న్స్ అందిన వెంటనే తుది రిజర్వేషన్ ప్రక్రియ పట్టాలెక్కనుంది. మొత్తానికి, జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మొదటి అడుగు రిజర్వేషన్ల ప్రక్రియతోనే ప్రారంభ మవుతోంది. ఈ నెల 29వ తేదీ వరకు 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన క్లారిటీ ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
280 జీపీలు..12 మండలాలు
జిల్లాలో 12 మండలాల పరిధిలో 280 గ్రామ పంచాయతీలు, రెండు మునిసిపాలిటీలు ఉన్నాయి. 2,534 వార్డులు ఉండగా, 134 మంది ఎంపీటీసీలు ఉన్నాయి. వీటి పరిధిలో 4లక్షల ఓటర్లు ఉన్నారు.
42 శాతం ప్రత్యేక జీవో కోసం
ఎదురుచూపులు
అధికార యంత్రాంగం
కసరత్తు