
మినీ లెదర్‌పార్క్ వినియోగంలోకి తెచ్చేందుకు కృషి
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్‌లో నిరుపయోగంగా ఉన్న మినీ లెదర్‌పార్కుకు వినియోగంలోకి తీసుకువచ్చేలా కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగిరి ప్రీతమ్ హామీ ఇచ్చారు. బుధవారం భూపాలపల్లిలో జరిగే దళిత సదస్సుకు వెళ్తున్న ఆయనకు డివిజన్‌కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ చేపూరి చిరంజీవి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రీతమ్ స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేలా ప్రత్యేక చొరవతో పనిచేస్తానన్నారు. మండలంలోని సముద్రాల, పాంనూర్, నమిలిగొండ గ్రామాల్లోని నిరుపేదలకు దాదాపు 20 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఇండ్ల పట్టాలు అందించినా ఇప్పటికీ ఇండ్ల స్థలాలు ఇవ్వలేదని, అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు అందించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కార్పొరేషన్ చైర్మన్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గుర్రం నవీన్, గాదె శ్రీధర్, నలిమెల నాగరాజు, చాడ ఏలియా, సంపత్, జీవన్, యాకస్వామి, రాజశేఖర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
నాగరిగిరి ప్రీతమ్